సార్ట్ హీరోయిన్ Trisha ను ఉద్దేశించి లియో సినిమాలో నటించిన Mansoor Ali Khan చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు మన్సూర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మన్సూర్ సారీ చెప్పాలని నడిగర్ సంఘం డిమాండ్ చేస్తుండగా.. తాను క్షమాపణలు చెప్పేది లేదని ఆయన తెగేసి చెబుతున్నారు. తమిళ, తెలుగు సినీ రంగాలకు చెందిన ప్రముఖులు త్రిషకు మద్దతుగా నిలుస్తూ మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నడిగర్ సంఘం మన్సూర్‌పై తాత్కాలికంగా నిషేధం విధించింది. త్రిషకు సారీ చెబితేనే ఈ నిషేధాన్ని తొలగిస్తామని స్పష్టం చేసింది. అయినా సరే తాను త్రిషకు క్షమాపణలు చెప్పబోనని మన్సూర్ స్పష్టం చేయడం గమనార్హం. మంగళవారం చెన్నైలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన మన్సూర్ అలీఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్పేది లేదన్నారు. తనపై నిషేధం విధించడం ద్వారా నడిగర్ సంఘం మిస్టేక్ చేసిందన్న మన్సూర్.. తన నుంచి వివరణ కోరితే బాగుండేదన్నారు.

అంతే కాదు తనపై నిషేధం విధిస్తూ జారీ చేసిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవడానికే నడిగర్ సంఘానికి మన్సూరే కొంత టైం ఇచ్చారు. నేను మీకు క్షమాపణలు చెప్పేవాడిలా కనిపిస్తున్నానా..? మీడియా నాకు వ్యతిరేకంగా నచ్చినట్టు రాసుకోవచ్చు. జనాలకు నేనేంటో తెలుసు. నాకు తమిళ ప్రజల మద్దతు ఉందని మన్సూర్ వ్యాఖ్యానించారు. ‘సినిమాల్లో రేప్ సీన్ అంటే నిజంగా రేప్ చేస్తారా..? సినిమాల్లో మర్డర్ సీన్ అంటే నిజంగా మర్డర్ చేస్తారా? కొంచెమైనా బుద్దుందా? నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. క్షమాపణలు చెప్పేదీ లేద’ని మన్సూర్ కుండబద్దలు కొట్టారు.