Kannappa : భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న మైథలాజికల్ సినిమా ఇది. మంచు విష్ణు లీడ్ క్యారెక్టర్‌లో నటిస్తోన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో కొనసాగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తోంది యూనిట్. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. సుమారు వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఎప్పుడు రిలీజ్ అయ్యేది ఇంకా ఖరారు కాలేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు ఇందులో కామియో రోల్‌లో కనిపించనున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మలయాళ టాప్ హీరో మోహన్ లాల్, శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఇందులో నటిస్తోన్నారు. శివుడి క్యారెక్టర్‌లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్నారు. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేయనుంది యూనిట్. ఈ సినిమా షూటింగ్‌లో అపశృతి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు గాయపడినట్లు సమాచారం.

డ్రోన్‌తో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో పొరపాటున అది మంచు విష్ణుపైకి దూసుకుని వచ్చినట్లు చెబుతున్నారు. డ్రోన్ వింగ్స్ తగిలి ఆయన చేతికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది తెలియరావట్లేదు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ ప్రమాదాన్ని ఇప్పటివరకు ఎవరూ నిర్ధారించలేదు.