టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, అతని నాలుగో భార్య పవిత్రా లోకేష్ కలిసి నటించిన మళ్లీ పెళ్లి మూవీ టీవీలోకి వచ్చేస్తోంది. టీవీ ప్రీమియర్ డేట్ ను స్టార్ మా ఛానెల్ అనౌన్స్ చేసింది. నరేష్, పవిత్ర జీవితాల్లో జరిగిన ఘటనలనే ఆధారంగా చేసుకొని ఈ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. రిలీజ్ కు ముందే ఈ మూవీకి ఎంతో బజ్ క్రియేటైంది. అయితే రిలీజైన తర్వాత మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్ ఉంటూ వచ్చింది.

ఇక ఇప్పుడు స్టార్ మా ఛానెల్లో వచ్చే ఆదివారం (ఆగస్ట్ 13) మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ మళ్లీ పెళ్లి సినిమా టెలికాస్ట్ కానుంది. నిజానికి ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ ఛానెల్స్ లో ప్రసారం కాకుండా చూడాలంటూ నరేష్ మూడో భార్య కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఆమె వాదనను తోసిపుచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటీటీతో పాటు శాటిలైట్‌లలో ఎలాంటి అడ్డంకులు లేకుండా మళ్లీ పెళ్లి సినిమాను ప్రదర్శించుకోవచ్చునని న్యాయస్థానం స్పష్టం చేసింది. నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్లీ పెళ్లి సినిమాకు ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహించాడు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మళ్లీ పెళ్లిలోని క్యారెక్టర్స్ ఉన్నాయని, ఈ సినిమాను ఓటీటీ, శాటిలైట్‌లో రిలీజ్ కాకుండా నిలిపివేయాలంటూ హైదరాబాద్‌తో పాటు బెంగళూరు కోర్టును రమ్య రఘుపతి ఆశ్రయించింది.

కానీ కోర్టు మాత్రం ఆమె వాదనతో ఏకీభవించలేదు. పైగా నానక్‌రామ్‌గూడలోని నరేష్ ఇంట్లోకి రమ్య రఘుపతి రాకపోకలపై నిషేధాన్ని విధిస్తూ కోర్టు దావాను స్వీకరించింది. రమ్య రఘుపతిపై నరేష్ గతంలోనే గృహనిషేధం కేసు పెట్టారు. ఈ కేసును పరిశీలించిన కోర్టు నరేష్‌కు అనుకులంగా తీర్పు ఇచ్చింది. నరేష్, రమ్య రఘుపతి ఆరు సంవత్సరాలుగా కలిసి ఉండటం లేదని కోర్టు నిర్ధారించినట్లు తెలిసింది. ఇటీవలే ఓ కన్నడ ఛానెల్ సహాయంతో నరేష్ ఇంటితో పాటు పవిత్రా లోకేష్‌పై రమ్య రఘుపతి ఓ స్టింగ్ ఆపరేషన్ చేసిందని, ఆమె కోసం వస్తోన్న వారి వల్ల నానక్‌రామ్‌గూడలోని నరేష్ ఇంట్లో ఉంటోన్న సీనియర్ సిటిజన్స్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని నరేష్ సమర్పించిన ఆధారాలను కోర్టు సమర్థించింది.