Bigg Boss : బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సీజన్‍లో చివరిదైన 15వ వారం నడుస్తోంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17వ తేదీన జరగనుంది. ప్రస్తుతం హౌస్‍లో ఫైనలిస్టులుగా ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, అంబటి అర్జున్, ప్రియాంక చివరి వారంలో నిలిచారు. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలేలో ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలనుంది. కాగా, బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ఫినాలే డే కోసం స్టార్ మా ఛానెల్ భారీగా ప్లాన్ చేస్తోంది.

ఈ సీజన్ ఫినాలేను భారీ ఈవెంట్‍లా చేయాలని స్టార్ మా నిర్ణయించింది. చాలా మంది సెలెబ్రెటీల పర్ఫార్మెన్సులు ఫినాలే రోజున ఉండనున్నాయి. యంగ్ హీరోయిన్లతో డ్యాన్స్ పర్ఫార్మెన్సెన్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తంగా గ్రాండ్ ఫినాలేను అత్యంతగా గ్రాండ్‍గా చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే, బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మెయిన్ గెస్ట్‌గా రానున్నారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఇప్పటికే ఈ విషయంపై స్టార్ మా ఛానెల్ మహేశ్‍తో మాట్లాడిందని తెలుస్తోంది.

గత సీజన్‍కు అతిథిగా చిరంజీవి రాగా.. ప్రస్తుత ఈ 7వ సీజన్‍కు మహేశ్ రావడం దాదాపు ఖరారైంది. బిగ్‍బాస్ 7వ సీజన్ విన్నర్‌ను మహేశ్ బాబు ప్రకటించనున్నారు. టీఆర్‌పీ రేటింగ్స్ పరంగా చూస్తే గత సీజన్ల కంటే ప్రస్తుతం 7వ సీజన్‍కే ఎక్కువగా వస్తోంది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు వస్తే గ్రాండ్ ఫినాలే టీఆర్పీ మరింత భారీగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. పనిలో పనిగా.. బిగ్‍బాస్‍లోనూ గుంటూరు కారం మూవీ ప్రమోషన్లను కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తారని తెలుస్తోంది. బిగ్‍బాస్ స్టేజీపైనే టీజర్ లాంచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.