సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో నటితో గొడవ జరగడంతో ఆ చిత్రాన్ని నిలిపివేశారు బాలీవుడ్ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్. బాలీవుడ్ స్టార్స్ తారాగణంగా పట్టాలెక్కిన ఆ సినిమా ఐదు రోజుల షూట్‌తోనే అటకెక్కింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన గురించి టీనూ ఆనంద్ తాజాగా మాట్లాడారు. సినిమా ఆగిపోవడానికి గల కారణాన్ని తెలియజేశారు.‘‘బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్, నటి మాధురి దీక్షిత్ జంటగా 1989లో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించా.

వాళ్లిద్దరి కాంబోలో అదే తొలి చిత్రం. దాంతో అందరికీ ఆ సినిమాపై ఆసక్తి ఉండేది. సినిమాలోని ఓ సీక్వెన్స్‌లో అమితాబ్ బచ్చన్‌ను కొంతమంది రౌడీలు బందిస్తారు. రౌడీల నుంచి హీరోయిన్‌ను కాపాడేందుకు ఆయన ఎంతో శ్రమిస్తారు. ఈ క్రమంలోనే తనని రక్షించిన హీరోకి కృతజ్ఞత తెలుపుతూ ఆయనతో అన్నివిధాలుగా దగ్గరవ్వాలని హీరోయిన్ అనుకుంటుంది. సినిమాలోని కీలకమైన ఈ సన్నివేశాల్లో హీరోయిన్‌ను లోదుస్తులతో చూపించాలనుకున్నా. అదే విషయాన్ని మాధురి దీక్షిత్‌కు చెప్పా. ఆమె మొదట ఓకే అన్నారు. తీరా, షూట్ రోజు లోదుస్తులతో యాక్ట్ చేయడానికి ఓకే చేయలేదు. దాంతో ఆమెకు నాకు గొడవ జరిగింది.

ఆ సీన్ చేయకపోతే సెట్ నుంచి వెళ్లిపొమ్మన్నా. ఆ మాటకు ఆమె బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయింది’’ అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. టీనూ ఆనంద్ దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ పలు సినిమాల్లో కనిపించారు. ‘ఆదిత్య 369’తో ఆయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘అంజి’లో విలన్‌గా కనిపించారు. ప్రస్తుతం ఆయన ‘సలార్’లో యాక్ట్ చేస్తున్నారు.