బాలీవుడ్ నటి కృతి సనన్, పాన్-ఇండియన్ హీరో, రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి నటించిన ‘ఆదిపురుష్’ త్వరలోనే థియేటర్ లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే కృతి సనన్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె త్వరలో నిర్మాతగా మారనుందని టాక్ వినిపిస్తోంది. కృతి సనన్ బాధ్యతలు నిర్వర్తించనున్న ఈ సినిమాకు ఓ కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మూవీలో హీరో హీరోయిన్లు, ప్రధాన పాత్రలో నటించే నటీ నటులు, ఇతర నటుల గురించి మాత్రం ఎలాంటి సమాచారం లేదు.

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రచారమే గనక నిజం అయితే కృతి సనన్ ను నిర్మాతగా చూడాలనుకునే సినీ ప్రేక్షకులు, కృతి ఫ్యాన్స్ కల నెరవేరినట్టే. ఇక కృతి సనన్ సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ‘గణపతి పార్ట్ 1’, ‘ది క్రూ’ సినిమాలతో పాటు ఇంకా పేరు ఖరారు కాని ఓ రొమాంటిక్ కామెడీ-డ్రామాలో నటించనుంది.

ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి సనన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను మోడలింగ్ లోకి అడుగు పెట్టినప్పుడు అక్కడి వాతావరణం, వ్యక్తులు గురించి పెద్దగా తెలియవని, అప్పుడప్పుడే అర్థం చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఓ ర్యాంప్ షోలో వాక్ చేసే అవకాశం వచ్చిందన్న ఆమె.. ఆ షోకి వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ తనను అవమానించటమే కాకుండా, అసభ్యంగానూ ప్రవర్తించాడని వాపోయింది. అది తనకెంతో బాధను కలిగించిందని తెలిపింది. ఆ సంఘటనతో కెరీర్‌నే వదిలేద్దామనుకున్నానని, అప్పుడు అమ్మకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పానని కృతి తెలిపింది.