Daniel Balaji : షాకింగ్….ప్రముఖ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ క‌న్నుమూత‌

- Advertisement -

Daniel Balaji : ప్రముఖ కోలీవుడ్ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ (48) అకస్మాత్తుగా క‌న్నుమూశాడు. శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆస్పత్రికి తరలించేలోపే బాలాజీ మృతి చెందిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. డేనియ‌ల్ బాలాజీ త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్నడ‌లో మొత్తం యాభైకిపైగా సినిమాలు చేశాడు. ఎక్కువ‌గా విల‌న్ రోల్స్‌లోనే కనిపించి ఆకట్టుకున్నాడు. చిట్టి అనే త‌మిళ సీరియ‌ల్‌తో డేనియ‌ల్ బాలాజీ యాక్టింగ్ కెరీర్ మొద‌లైంది. ఆ సీరియల్ పిన్ని పేరుతో తెలుగులో డ‌బ్ అయింది. ఆ త‌ర్వాత ఏప్రిల్ మ‌దాతిల్, కాద‌ల్ కొండెన్ సినిమాల్లో చిన్న పాత్రలు చేశాడు.

క‌మ‌ల్‌హాస‌న్, గౌత‌మ్ మీన‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రాఘ‌వ‌న్ సినిమాలో సైకో క్యారెక్ట‌ర్‌లో త‌న విల‌నిజంతో ఆడియెన్స్‌ను భ‌య‌పెట్టాడు. ఈ సినిమా న‌టుడిగా అత‌డికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత త‌మిళంలో పొల్ల‌వ‌ద‌న్‌, జ్ఞాన‌కిరుక్క‌న్‌, అచ్చం యెన్‌బ‌దు మద‌మైయదా, వ‌డాచెన్నై, బిగిల్‌తో పాటు చాలా సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ పాత్ర‌ల్లో క‌నిపించాడు. పోలీస్ క్యారెక్టర్స్ కూడా అతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. చివ‌ర‌గా గ‌త ఏడాది అరియ‌వాన్ అనే త‌మిళ సినిమాలో క‌నిపించాడు. తెలుగులో కూడా ఐదారు సినిమాలు చేశారు బాలాజీ. ఎన్టీఆర్ సాంబ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత వెంక‌టేష్ ఘ‌ర్ష‌ణ మూవీలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒక‌రిగా క‌నిపించాడు. రామ్‌చ‌ర‌ణ్ చిరుత‌, నాగ‌చైత‌న్య సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్రలు పోషించాడు

- Advertisement -

నాని హీరోగా 2021లో రిలీజైన ట‌క్ జ‌గ‌దీష్‌ అతడి ఆఖరి తెలుగు చిత్రం. ఆ సినిమాలో మెయిన్ విల‌న్‌గా క‌నిపించాడు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మ‌ల‌యాళంలో డాడీ కూల్‌, భ‌గ‌వాన్ మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టిల‌కు ధీటుగా విల‌నిజాన్ని పండించాడు. డేనియ‌ల్ బాలాజీ తండ్రి తెలుగు మూలాలున్న కుటుంబంలో జ‌న్మించాడు. అత‌డి తండ్రి తెలుగువాడు కాగా త‌ల్లి త‌మిళ్‌. డైరెక్ట‌ర్ కావాల‌ని ఫిలిం మేకింగ్ కోర్సు నేర్చుకున్న డేనియ‌ల్ బాలాజీ చివ‌ర‌కు న‌టుడిగా స్థిర‌ప‌డ్డాడు. చెన్నైలోని పుర‌సామివాకంలో శ‌నివారం డేనియ‌ల్ బాలాజీ అంత్య‌క్రియ‌ల‌ను కుటుంబ‌స‌భ్యులు నిర్వ‌హించ‌నున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here