Janhvi Kapoor : శ్రీదేవి తనయగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ కొంతకాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తండ్రి బోనీకపూర్ సూచనలు, సలహాలు పాటిస్తూ కెరీర్‌లో బిజీ నాయికగా మారుతోంది. తాజాగా ఈ అమ్మడి గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అది తెలిసిన వారంతా వామ్మో జాన్వీ మాములు ముదురు కాదు అని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సుందరికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. ‘ధడక్’ సినిమా షూటింగ్ సమయంలో ఏమాత్రం సమయం లభించినా డ్యాన్స్ చేసేది. సినిమాల్లోకి వచ్చాక డ్యాన్స్ క్లాసులకు వెళ్లడం కుదరలేదని చెప్పింది. అలాగే, కవిత్వమంటే చాలా ఇష్టమని.. అప్పుడప్పుడు కవితలు రాస్తానని తెలిపింది. ఈ బాలీవుడ్ బ్యూటీ పేరంటే చాలా మందికి ఇష్టం. అయితే, జాన్వీకు ఈ పేరు పెట్టడం వెనుక ఓ క్యూట్ స్టోరీ ఉంది. 1997లో శ్రీదేవి, అనిల్ కపూర్ కలిసి ‘జుదాయి’ అనే సినిమాలో నటించారు. దీన్ని బోనీ కపూర్ నిర్మించారు. ఆ సినిమాలో ఊర్మిళ మతోంద్కర్ కూడా కీలకపాత్ర పోషించారు. ఆ పాత్ర పేరు జాన్వీ. ఈ పేరంటే శ్రీదేవి, బోనీకు చాలా ఇష్టమట. వారి మొదటి బిడ్డకు ఈ పేరు పెట్టాలని ఆ సినిమా సమయంలోనే నిర్ణయించుకున్నారట. అలా కుదిరిన పేరే జాన్వీ కపూర్. ఒక టాక్ షోలో జాన్వీ తండ్రికి తెలియకుండా చేసిన ప్రయాణం గురించి చెప్పింది.
‘నేను నాన్నకు అబద్ధం చెప్పి లాస్ వెగాస్ వెళ్లాను. సినిమాకు వెళ్తున్నానని చెప్పి విమానంలో వెగాస్ వెళ్లాను. అక్కడ కొంతసమయం గడిపి వెంటనే రిటన్ అయ్యాను. ఆ ప్రయాణం ఎంతో థ్రిల్‌ను అందించింది’ అని నవ్వేసింది. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి వివరించింది. ‘నా పెళ్లి కచ్చితంగా తిరుపతిలోనే సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. నేను కాంచీవరం జరీ చీరను కట్టుకుంటాను. వివాహం తర్వాత ఇష్టపడే అన్ని దక్షిణాది వంటకాలతో దావత్ ఇస్తాను. ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం ఇలాంటివన్నీ ఉంటాయి’ అని తెలిపింది.