‘జబర్దస్త్’ ఫేమ్, నటి రౌడీ రోహిణి (Rohini) ఇటీవల ఆస్పత్రిలో చేరారు. కాలు సర్జరీ కోసం వెళ్లినట్టు తెలిపారు. అయితే సర్జరీ చేయడం కుదరదని వైద్యులు చెప్పారని వాపోయారు. ఈ మేరకు తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. తనకు కాలు బాలేదని తీసేయాలేమోనని బయపడినట్లు తెలిపింది. కానీ డాక్టర్లు చెప్పింది విని ధైర్యం వచ్చినట్లు చెప్పింది. దీంతో అసలు ఆమెకు ఏమైందని ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు.

సీరియల్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోహిణి ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’తో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె పలు చిత్రాలు, సిరీస్‌ల్లో నటించారు. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇటీవల విడుదలైన ‘బలగం’, ‘సేవ్ ది టైగర్స్’లో ఆమె నటన ఆకట్టుకుంది. ఇక బలగం సినిమాలో ఆమె నటన అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకే ఆమె నటన చాలా కలిసొచ్చిందని అంతా అనుకున్నారు. ఇంత పెద్ద సక్సెస్ తర్వాత ఆమె ఆసుపత్రిలో చేరడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

‘‘సుమారు ఐదేళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ తర్వాత నా కాలులో రాడ్ వేశారు. దాన్ని తీయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాకపోతే, వరుస షూటింగ్స్ వల్ల సర్జరీకి వెళ్లడం వీలుపడలేదు. కానీ, ఇప్పుడు కాస్త సమయం దొరికింది. రాడ్ తీయించి, ప్రశాంతంగా ఉందామని భావించి ఆస్పత్రికి వచ్చిన నాకు నిరాశే ఎదురైంది. చాలా కాలం కావడం చేత రాడ్ నా స్కిన్‌కు అటాచ్ అయిపోయిందని.. ఒకవేళ ఫోర్స్ పెట్టి తీస్తే మల్టీపుల్ ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు.’’ అని రోహిణి వాపోయారు. అయితే, రాడ్ తొలగించనప్పటికీ తన కాలుకి మైనర్ సర్జరీ చేశారని వెల్లడించారు.