ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వ్యూయర్ షిప్ కోసం ఏం చేసేందుకైనా వెనకాడడం లేదు. సెలబ్రిటీలకు లింకు పెట్టడం, వాళ్ల మధ్య రూమర్లు క్రియేట్ చేయడం, బతికుండగానే చంపేయడం చేస్తున్నారు. దీంతో వారు మానసిక క్షోభకు గురై ఇది నిజం కాదంటూ ప్రజలకు తెలుపుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇటీవల కమెడియన్ సుధాకర్ ను సోషల్ మీడియాలో చంపేశారు. మళ్లీ ఆయన మీడియా ముందుకు వచ్చి నేను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అప్పారావును చంపేశారు. దీంతో ఆయన కూడా నేను బతికే ఉన్నాను… అయినా బతికుండానే చంపే హక్కు మీకెవరిచ్చారని కాస్తంత ఎమోషనల్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. అందులో అప్పారావు ఒకరు. అప్పారావు మొదట సినిమాల్లో ఆర్టిస్ట్‌గా చేశారు. పెద్దగా గుర్తింపు రాలేదు. జబర్దస్త్ షోలో అడుగుపెట్టినప్పటి నుంచి అప్పారావు కెరీర్ కొత్త స్థాయికి చేరుకుంది. జబర్దస్త్‌లో చాలా మంది టీమ్ లీడర్‌లతో కలిసి పనిచేశాడు. చలాకీ చంటి స్కిట్స్‌లో ఎక్కువగా పనిచేసిన అప్పారావు ఆ తర్వాత సుధీర్ స్కిట్స్‌లో పనిచేశాడు.
కానీ అప్పారావు మాత్రం జబర్దస్త్‌లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమయ్యే అనేక షోలలో కూడా పాల్గొని ప్రేక్షకులను అలరించేవాడు. 2013 నుంచి జబర్దస్త్ షోలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా జబర్దస్త్ షోపై అప్పారావు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. షోలో కొంతమంది వల్ల హాస్యనటులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో కొంతమందికి కమెడియన్లకు అన్యాయం జరుగుతోందని.. అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానని అప్పారావు అన్నారు.

ఇదిలా ఉండగా అప్పారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటీనటులను బతికుండగానే చంపేస్తున్నారని, ఇది ఏమాత్రం సరికాదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘డిజిటల్ మాధ్యమం చాలా వేగంగా డెవలప్ అయింది. సోషల్ మీడియా చాలా పవర్‌ఫుల్‌గా అవుతోంది. అయితే కొంత మంది మాత్రం దానిని సరైన రీతిలో ఉపయోగించటం లేదు. కొందరైతే మీతి మీరి దారుణంగా థంబ్ నెయిల్స్ పెడుతున్నారు.
యూ ట్యూబ్ వాళ్లందరికీ నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నిజానికి నేను ‘యూ ట్యూబ్ నీకో నమస్కారం’ అనే నాటికను రాద్దాం అని అనుకుంటున్నాను. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే కొంత బాధతో చెబుతున్నాను. నటీనటులను బతికుండగానే చంపేస్తున్నారు. ఈ థంబ్ నెయిల్ ఇలా పెడితేనే చూస్తారనుకునే మీ ఆలోచన అదే అయితే మీకో నమస్కారం. మనిషి బతికుండగా చనిపోయారని చెప్పే హక్కు మీకు ఎవరు ఇచ్చారు. లేనిపోనివన్నీ పెట్టే మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేయొద్దు’ అని వేడుకున్నారు.