‘డిజిటల్ మాధ్యమం చాలా వేగంగా డెవలప్ అయ్యింది.. సోషల్ మీడియా చాలా పవర్‌ఫుల్‌గా అవుతోంది కూడా. అయితే కొంత మంది మాత్రం దీన్ని సరైన రీతిలో ఉపయోగించటం లేదు. కొందరైతే మీర దారుణంగా థంబ్ నెయిల్స్ పెడుతున్నారు’ అని తన బాధను వ్యక్తం చేశారు జబర్దస్త్ కమెడియన్ అప్పారావు. రీసెంట్‌గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘యూ ట్యూబ్ వాళ్లందరికీ నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నిజానికి నేను ‘యూ ట్యూబ్ నీకో నమస్కారం’ అనే నాటికను రాద్దాం అని అనుకుంటున్నాను. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే కొంత బాధతో చెబుతున్నాను.

సుప్రసిద్ధ నటీనటులు బతికి ఉండగానే చంపేస్తున్నారు. థంబ్ నేల్ ఇది పెడితేనే చూస్తారు అనే దాంట్లో ఉంటే దయచేసి నమస్కారం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. నో డౌట్. సోషల్ మీడియా ఇప్పుడు బలంగా ఉంది. కాబట్టి నేను అంగీకరిస్తాను. మనిషి బతికుండగా చనిపోయాడు అని చెప్పే అధికారం మీకు ఎవరు ఇచ్చారు. నేను నేరుగా మాట్లాడుతున్నా. ఎవరైనా చనిపోవాల్సిందే. వార్తలు రాసిన వారు కూడా చనిపోవాల్సిందే. లింక్ ఓపెన్ చేయడానికి దారుణమైన కాప్చన్స్ పెట్టకండి. లేనిపోని వన్నీ పెట్టేసి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేయకండి. పెద్దవారి అందరి తరపునా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ ఎంత మంది కమెడియన్స్‌కి కొత్త జీవితాన్ని ప్రసాదించిన కామెడీ షో జబర్దస్త్. ఈ షోతో ప్రేక్షకులను నవ్వించిన ఎంతో మంది కమెడియన్స్ సిల్వర్ స్క్రీన్‌పై కూడా అడుగు పెట్టారు. అక్కడ కూడా తమదైన కామెడీతో మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో అప్పారావు ఒకరు. పలు చిత్రాల్లో తనదైన హాస్యంతో ఆయన ప్రేక్షకులను అలరించారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నారు. జబర్దస్త్ షో నుంచి బయటకు రావటానికి గల కారణాలను కూడా ఆయన పలు ఇంటర్వ్యూస్‌లో చెప్పిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా తనను హోల్డ్‌లో పెట్టమన్నారని, తర్వాత షో ప్రారంభమైనప్పటికీ తనను పిలవలేదని, అది తనకు నచ్చక షో నుంచి బయటకు వచ్చేశానని అన్నారు. తనకు జబర్దస్త్‌లో అవకాశం వచ్చినా మళ్లీ వెళ్లనని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. ఎవరితోనూ తనకు మనస్పర్దలు లేవని కూడా ఆయన చెప్పారు.