Hyper Adhi : హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో ఆది ఒకరు. బుల్లితెర అభిమానులను తన కామెడీ పంచులతో కడుపుబ్బ నవ్విస్తుంటారు. అలా జబర్దస్త్ షో నుంచి డ్యాన్స్ రియాల్టీ షో ఢీలోకి అడుగుపెట్టి అక్కడ తన స్టైల్ కామెడీతో దూసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో వెండితెరపై కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ కెరీర్లో బిజీగా మారిపోయారు. ఇక ఇటీవలే కమెడియన్ హైపర్ ఆది రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ అనేక ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొంటూ.. ఆ పార్టీ సభల్లో రాజకీయ ప్రస్తావనలతో పాటు అనేక విషయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందేజ

ఇక ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి తన రాజకీయ ప్రవేశం పై స్పందించాడు. ఆది మాట్లాడుతూ.. ప్రొఫెషన్ వేరు రాజకీయం వేరు. నేను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను అంటే జబర్దస్త్ షో నే కారణం. నాకు రోజా గారితో ఎలాంటి గొడవలు లేవు. జబర్దస్త్ సెట్ లో రోజా గారు ఎప్పుడు కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడరు. నాగబాబు గారు లాగానే ఆమె కూడా నవ్వుతూ ఉంటుంది. తను ఇష్టపడే వ్యక్తులు వేరు నేను ఇష్టపడే వ్యక్తులు వేరు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. పవర్ స్టార్ అనుసరించే ప్రతి ఒక్క సిద్ధాంతం నాకు నచ్చుతుంది. నేను పదవులు, ఎమ్మెల్యే టికెట్లు ఆశించి జనసేనకు సపోర్ట్ చేయడం లేదు. ఒకవేళ నాకు జనసేన టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే మాత్రం తప్పకుండా చేస్తాను. పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసమే నేను కలుస్తాను. ఒకసారి అయిన జనసేన తరుపున నేను క్యాంపెయిన్ చేయడానికి వెళ్తాను ” అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చారు. ఇక ఈయన వ్యాఖ్యలు విన్న పలువురు ఈయనకి ఒక సీట్ ఇవ్వడం పక్కా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
