Hot Spot Review : ఈమధ్య కాలం లో ప్రేక్షకులు థియేటర్స్ కంటే ఎక్కువగా ఓటీటీ కంటెంట్ కి బాగా అలవాటు పడిన సంగతి మన అందరికీ తెలిసిందే. అందుకే మేకర్స్ కూడా ఎక్కువగా ఓటీటీ కంటెంట్స్ ని తక్కువ బడ్జెట్ లో చేసేందుకు అమితాసక్తిని చూపిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ , హాట్ స్టార్ వంటి అంతర్జాతీయ ఓటీటీ సంస్థలకు మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా అత్యధిక యూజర్లు ఉన్నారు.
కానీ మన తెలుగు నిర్మాత అయిన అల్లు అరవింద్ కూడా ఆహా అనే ఓటీటీ సంస్థని ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఓటీటీ ద్వారా ఎన్నో బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లు సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా తమిళం లో సూపర్ గా నిల్చిన హాట్ స్పాట్ లో మూవీ ని తెలుగు దబ్ చేసి ఆహా లో విడుదల చేసారు. ఈ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతలా రెస్పాన్స్ దక్కించుకోవడానికి ఈ సినిమాలో ఉన్న విశేషాలేంటో ఒకసారి చూద్దాం.
కథ :
రొటీన్ రివెంజ్ కథలు, ప్రేమ కథలు విని విసిగిపోయిన ఒక నిర్మాత కి పట్టరాని చిరాకు వచ్చేస్తుంది. అలాంటి సమయం లో మహమ్మద్ రఫీ అనే వ్యక్తి ఆ నిర్మాతకి కథ చెప్పేందుకు వస్తాడు. అప్పటికే చిరాకు లో ఉన్న నిర్మాత కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఇస్తాను, అంతలోపు కథ చెప్పు అంటాడు. అప్పుడు మహమ్మద్ రఫీ తన దగ్గరున్న నాలుగు కథలను ఆ నిర్మాతకు చెప్తాడు. ఈ కథలు విన్న తర్వాత ఆ నిర్మాత రియాక్షన్ ఏమిటి? , రఫీ ఎందుకు ఆ నిర్మాతకు ఈ కథలు చెప్పాలని అనుకున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
స్టోరీ లైన్ విన్న తర్వాత ఇంతేనా అని మీకు అనిపించొచ్చు. కానీ దర్శకుడు స్క్రీన్ ప్లే ని నడిపించిన విధానం చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు. ఊహించని ట్విస్టులన్నీ ఈ చిత్రం లో ఉంటాయి. దీనిని ఒక సినిమా అనడం కంటే ‘అందాలజీ’ అని అనొచ్చు. ‘హ్యాపీ మ్యారీడ్’, ‘గోల్డెన్ రూల్’, ‘టమోటో చట్నీ’, ‘ఫేమ్ గేమ్’ అనే నాలుగు వేర్వేరు కథలను ఈ సినిమాలో మనం చూడొచ్చు. పెళ్లి తర్వాత ఆడపిల్లలు మాత్రమే పుట్టింటిని ఎందుకు వదిలిపెట్టాలి అనేది మొదటి కథాంశం.
అలాగే ప్రేమించుకున్న ఒక జంటకి ఇలాంటి వింత పరిస్థితి కూడా ఎదురు అవుతుందా అని చూసే ప్రేక్షకుల ఫ్యూజులు ఎగిరే రేంజ్ ఆశ్చర్యపరిచే సన్నివేశాలతో కూడినది రెండవ కథాంశం. ఇక మూడవ స్టోరీ తప్పు చేసిన కూడా సమర్ధించుకొని సమాజం లో బ్రతికే ఒక అబ్బాయికి బుద్ధి చెప్పే అమ్మాయి కథాంశం. ఇక చివరి కథ టీవీ షోస్ వల్ల పిల్లలు ఎంత దారుణమైన పరిస్థితికి చేరుకున్నారు అనేది.
ఒక్కో కథ ని దర్శకుడు తీర్చి దిద్దిన తీరుని చూసి అవాక్కు అవ్వడం మన వంతు అవుతుంది. కొత్త తరహా టేకింగ్ తో, కలలో కూడా ఊహించని ట్విస్టులతో, అసలు ఈ డైరెక్టర్ కి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది రా బాబు అని అనిపించేంత సెన్సేషనల్ టేకింగ్ తో ఈ సినిమా ఉంటుంది. ముఖ్యంగా రెండవ కథలో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ కి మింగుడు పడడం చాలా కష్టం గా ఉంటుంది. ఇలాంటి కంటెంట్ ని ఓటీటీ లో ఈమధ్య కాలం లో మీరు ఎప్పుడూ చూసుండరు. ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఆహా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని చూసేయండి.