Surabhi : తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయిన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే సంపాదించుకుంది హీరోయిన్ సురభి. ఆమె ఇటీవల తనకు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పుకొచ్చింది. మామూలుగానే విమానాలు అప్పుడప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ అవుతుంటాయి. అకస్మాత్తుగా విమాన ప్రమాదాలు జరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. ఇలానే ఓ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందట. కాకపోతే పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో తామంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డామని నటి సురభి చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఇన్ స్టా స్టోరీలో ఆమెకు ఎదురైన ఈ భయంకర ఘటన గురించి వివరించింది.

‘హలో ఎవ్రీవన్.. ఆదివారం నేను విమానంలో ప్రయాణించాను. ఇంత వరకు నాకు ఎప్పుడూ ఎదురుకాని వింత అనుభవం ఎదురైంది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చానన్న ఫీలింగ్ కలిగింది. విమానంలో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగే పరిస్థితి వచ్చింది. ఆ ఫ్లైట్ మొత్తం కంట్రోల్‌లో లేకుండా పోయింది. నా గుండె జారి నోట్లోకి వచ్చినంత పనైంది. కొన్ని గంటల తరువాత ఫైలెట్ తీసుకున్న నిర్ణయంతో మేం అంతా బతికిపోయాం. సురక్షితంగా మమ్మల్ని భూమ్మీద ల్యాండ్ చేశాడు. ఆ ఘటనను ఊహించుకుంటేనే భయంగా ఉంది. నేను ఈ రోజు ఇలా బతికి ఉన్నందుకు.. నాలో ఉన్న పాజిటివ్ థింకింగ్ మీద నాకు మరింత నమ్మకం ఏర్పడింది’ అంటూ సురభి చెప్పుకొచ్చింది.
హీరోయిన్ సురభి తెలుగు, తమిళం, కన్నడలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో సందీప్ కిషన్ బీరువా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎక్స్ ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్ వంటి చిత్రాలతో హిట్ కొట్టేసింది. అల్లు శిరీష్ ఒక్క క్షణం సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది. చివరగా ఆది హీరోగా వచ్చిన శశి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకే ఒక లోకం నువ్వే అనే పాటతో సినిమా బాగా ట్రెండ్ అయింది. దాంతో పాటు సురభి కూడా మరింతగా ఫేమస్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.