Sai Pallavi : దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ అవుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీజర్‌లో సాయి పల్లవి, నాగ చైతన్యల విజువల్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. చందు మొండేటి ప్రేమమ్, కార్తికేయ 2 బ్లాక్ బస్టర్స్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా మత్స్యకారుల కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది చిత్ర బృందం. ఇందులో ఆమె న్యాచురల్ లుక్ తో సాయి పల్లవి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త అప్ డేట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ చివరలో చనిపోతుందన్న వార్త ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. దీంతో సాయి పల్లవి అభిమానులకు హార్ట్ బ్రేక్ అయినట్లుంది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ దీనిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. ఆమె చనిపోతే సినిమా సక్సెస్ అవ్వదు అంటూ దర్శకుడి పై ఫైర్ అవుతున్నారు. అయితే ఇప్పటికే డైరెక్టర్ చందు మొండేటికి ఇలాంటి మెసేజ్ లు చాలా వచ్చినట్లు తెలుస్తుంది.