Vithika Sheru : బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వితికా షేరు. పదహారాణాల తెలుగు అమ్మాయి అయిన వితికా.. 15 ఏళ్ల వయసులోనే కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ అయ్యింది. అంతు ఇంతు ప్రీతి బంతు అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చింది. ప్రేమించు రోజుల్లో మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. ఝుమ్మంది నాదం, భీమిలీ కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాల్లో కీలకపాత్రల్లో నటించింది. యంగ్ హీరో వరుణ్ సందేశ్ సరసన పడ్డానండి ప్రేమలో నటించి ప్రేమలో పడింది. ఆ తర్వాత ఓ తమిళ సినిమా చేసింది. పెద్దల అంగీకారంతో 2016లో వరుణ్ వితిక పెళ్లి చేసుకున్నారు.

హీరో వరుణ్ సందేశ్ కూడా హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కుర్రాడు, మరో చరిత్ర వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కుర్రాడు పెద్ద హీరో అవుతాడు అనుకుంటే.. కెరీర్‌లో అనుకున్న రీతిలో ఆఫర్లు రాక సినిమాలకు దూరం అయ్యాడు. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మెప్పించి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రీసెంట్ గా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.
ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ ‘నింద’ అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నింద సినిమా జూన్ 21న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కు యంగ్ హీరో నిఖిల్ ముఖ్య అతితిగా వచ్చాడు. అలాగే వరుణ్ సందేశ్ సతీమణి నటి వితిక షేరు కూడా హాజరైంది. అయితే వరుణ్ తన కెరీర్‌లో ఎక్కువ ఫ్లాప్ లే చూశాడు, కొన్నాళ్ళు సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చాడు కదా అని అడిగిన ప్రశ్నకు వితిక షేరు స్పందించింది.

తాను మాట్లాడుతూ.. చాలా మంది ఇలా వరుణ్‌ని ఫెయిల్యూర్ హీరో అంటున్నారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 17 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ సినిమాలు తీస్తున్నాడు. ఇక్కడ ఫెయిల్ అయితే నాకు వద్దు అని అన్ని సర్దేసుకుని వెళ్లిపోయేవాళ్లు ఫెయిల్ అయినట్టు. ఫ్లాప్స్ రాగానే సినిమాలు వదిలేసి వెళ్లిపోయేవాళ్లు ఫెయిల్ యాక్టర్స్. మా ఆయన అలా వెళ్లిపోలేదు. మా ఆయన ఫెయిల్యూర్ యాక్టర్ కాదు అని చెప్తూ స్టేజిపై ఆల్మోస్ట్ ఏడ్చేసింది. దీంతో తన భర్తకు ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో అని వితికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.