HBD Allu Arjun : మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొద్ది రోజుల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ (Allu arjun). నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జర్నీ విశేషాలను ఓ సారి గుర్తు చేసుకుందాం. అల్లు అర్జున్ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా, సినీ ప్రపంచాన్ని ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేశాడు. బాలనటుడిగా 1985 లోనే విజేత, 1986లో స్వాతిముత్యం సినిమాల్లో కనిపించిన బన్నీ 2003 సంవత్సరంలో ‘గంగోత్రి’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ సినిమాలో బన్నీ తన లుక్ కు విమర్శలూ ఎదురయ్యాయి. వాటన్నిటికీ ఆర్య సినిమాతో సమాధానం చెప్పాడు. వెండితెరపై తనదైన నటన, డాన్సులతో ఆకర్షించి స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. యమ అట్రాక్టివ్ లుక్‌లో లేడీ ఫ్యాన్స్‌ని సొంతం చేసుకుని, యువత పులకరించి పోయేలా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. అలాగే మాస్ డైలాగ్స్ చెబుతూ థియేటర్స్‌లో ఈలలు వేయించడంలోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. ‘ఆర్య’ సినిమాలో లవర్ బాయ్‌గా కనిపించి రెండో సినిమాతోనే స్టార్ స్టేటస్ కొట్టేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu arjun) నటనకు నంది అవార్డు కూడా లభించింది. ఇక అక్కడి నుంచి ఎక్కడా వెనుతిరిగి చూడలేదు.
‘బన్నీ, హ్యాపీ, దేశముదురు” లాంటి వరుస హిట్స్ తో యూత్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తన ప్రత్యేక డైలాగ్ డెలివరీతో తెలుగు యువత మనసు దోచుకున్నాడు. ‘గంగోత్రి’లో అమాయక చక్రవర్తిగా కనిపించిన బన్నీ ‘దేశముదురు’ సినిమాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో సన్యాసిని సైతం ప్రేమలో పడేసి ప్రేమకు ఏదీ అడ్డు రాదని నిరూపించాడు. డైలాగ్ డెలివరీతో, డ్యాన్స్ స్టెప్పులతో, కొత్త లుక్స్‌తో ఎప్పటికప్పుడు నయా ట్రెండ్ సృష్టిస్తూ తనకు తానే సాటి తనకు తానే పోటీ అన్నట్లు ఎదిగాడు.
పరుగు, ఆర్య 2, వరుడు, వేదం, బద్రినాథ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, ఎవడు.. ఇలా ప్రతి సినిమాలోనూ వైవిధ్యాన్ని చూపుతూ వారెవ్వా అనిపించుకున్నాడు. ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో నటించి తెలుగుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. కేవలం స్టైలిష్ లుక్ లోనే కాదు కథ డిమాండ్ చేస్తే డీ గ్లామర్ రోల్స్ లోనూ నటించగలనని నిరూపించాడు.
సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాధం, సరైనోడు, అల.. వైకుంఠపురములో సినిమాలతో నిర్మాతలకు కాసుల పంట పండించాడు. ఇక పుష్ప సినిమాతో ఈ దేశ ముదురు ప్రపంచ దేశాల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగి ఔరా అనిపించుకున్నాడు. కష్టపడే తత్వం ఉంటే ఎందులోనైనా విజయం సాధించవచ్చని నిరూపించాడు. తాజాగా పుష్ప2లో నుంచి అల్లు అర్జున్ ఫస్టలుక్ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ ఫస్ట్ లుక్ చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. అందుకు కారణం.. ఐకాన్ స్టార్ అందులో సరికొత్త లుక్‌లో కనపడటమే. డిఫరెంట్ లుక్ లో అందరినీ కట్టిపడేస్తూ ఈ సినిమాకు కూడా కాసుల వర్షం కచ్చితం అన్నట్లు కనిపిస్తున్నాడు.
ఇక బన్నీ సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే స్నేహా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సినిమాల షూటింగ్ విరామ సమయాల్లో అల్లు అర్జున్ ఫ్యామిలీతో గడుపుతూ ఉంటారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు.