Gangs of Godavari : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన ఇటీవలే గామీ అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలో ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ మూవీతో రానున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా.. అంజలి ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫర్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ మాస్ రోల్ లో కపిపించనున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకుంది.. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇటీవల కాలంలో సరైన మాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీసుకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి మీద భారీ అంచనాలే ఉన్నాయి. విశ్వక్ సేన్ మొదటిసారి పక్కా పల్లెటూరి గెటప్ లో నటిస్తున్నారు. రౌడీ ఫెలోతో ఆకట్టుకుని చల్ మోహనరంగాతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన దర్శకుడు కృష్ణ చైతన్య తిరిగి తన బలమైన సీరియస్ జానర్ కు వచ్చేశాడు. రీసెంట్ గా హైదరాబాద్ దేవి థియేటర్లో ట్రైలర్ రిలీజ్ చేశారు. కథ గురించి అవగాహన వచ్చేలా రెండు నిమిషాల ఇరవై సెకండ్ల వీడియోని విడుదల చేశారు.
పచ్చదనానికి ప్రశాంతతకు కేరాఫ్ గా నిలిచిన గోదావరి ప్రాంతంలో లంకల రత్నాకర్(విశ్వక్ సేన్) ది దూకుడు మనస్తత్వం. ఎవడు అడ్డొచ్చినా కొట్టే రకం. అతడికి రాజకీయాల్లోకి రావాలని మహా కోరిక. అనుకోవడమే ఆలస్యం రంగంలోకి దిగుతాడు. బుజ్జి(నేహా శెట్టి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఎన్నికల్లో నిలబడి గెలవాలంటూ కలలు కన్న రత్నానికి కొత్త ప్రత్యర్థులు ఎదురవుతారు. కత్తి పట్టుకుని నరకడం మొదలుపెట్టాల్సి వస్తుంది. ఆఖరికి కుటుంబమే ఆపదలో పడుతుంది. ఆడాళ్లు, మగాళ్లు కాకుండా మనుషుల్లో మూడో రకమే పొలిటికల్ లీడర్లని నమ్మే రత్నం చివరికి ఏం చేశాడనేది థియేటర్లలో చూడాల్సిందే.
చాలా కష్టపడి దర్శకుడు కృష్ణ చైతన్య గ్యాంగ్స్ అఫ్ గోదావరిని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. అందమైన గోదావరి తీరంలో అలజడులు కూడా ఉంటాయని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశారు. విశ్వక్ సేన్ తనదైన శైలిలో చెప్పిన మాస్ డైలాగులు పేలేలా ఉన్నాయి. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అనిత్ మదాడి ఛాయాగ్రహణం సినిమాపై అంచనాలు పెంచాయి. మే 31 గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా విడుదల కానుంది.