Bollywood Couples : బాలీవుడ్ నటి, హేమా మాలిని కూతురు ఈషా డియోల్ విడాకులు తీసుకుంది. 11 ఏళ్లుగా భర్త భరత్ తక్తానీతో కలిసి ఉన్న ఆమె.. తాము విడిపోతున్నట్లు మంగళవారం (ఫిబ్రవరి 6) వెల్లడించింది. ఈ ఇద్దరూ కలిసి చేసిన అనౌన్స్‌మెంట్ వైరల్ అయింది. 2012లో పెళ్లితో ఒక్కటైన ఈ జంట.. తాము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం. వీళ్ల విడాకులకు కారణం ఏంటన్నది మాత్రం తెలియలేదు.

హేమా మాలిని కూతురుగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈషా డియోల్.. 2012లో భరత్ పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు రాధ్యా, మిరాయా కూడా ఉన్నారు. ఇప్పుడు విడాకులు తీసుకున్నా కూడా వాళ్లిద్దరి సంరక్షణను కలిసే చేపట్టనున్నట్లు ఈ జంట వెల్లడించింది. ఈ సమయంలో తమకు ప్రైవసీ కావాలని కూడా వీళ్లు అభిమానులను కోరారు. “మేమిద్దరం పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వక వాతావరణంలో విడిపోవాలని నిర్ణయించుకున్నాం.

మా జీవితాల్లో జరుగుతున్న ఈ మార్పు సమయంలో మా ఇద్దరు పిల్లల సంరక్షణ, వాళ్ల ప్రయోజనాలే మాకు చాలా ముఖ్యం. మా ప్రైవసీని అందరూ గౌరవించాలని కోరుకుంటున్నాం” అని ఈషా, భరత్ ఓ సంయుక్త ప్రకటనలో కోరారు. ఈ ఇద్దరి విడాకుల విషయమై హిందుస్థాన్ టైమ్స్.. ఈషా డియోల్ తల్లి హేమా మాలినిని సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమె అందుబాటులోకి రాలేదు. ధర్మేంద్ర, హేమా దంపతులకు 1981లో ఈషా జన్మించింది. ఆమెకు అహానా డియోల్ అనే చెల్లెలు కూడా ఉంది.