DJ Tillu : క్యారక్టర్ ఆర్టిస్టుగా ఒక మంచి పేరు తెచ్చుకున్న తర్వాత హీరో గా మారి సక్సెస్ లు కొట్టడం అంత తేలికైన విషయం కాదు. అప్పట్లో చిరంజీవి, రజినీకాంత్, రవితేజ వంటి హీరోలు ఇలా ఎదుగుతూ వచ్చిన వాళ్ళే. ప్రస్తుతం వారసత్వం ఇండస్ట్రీ ని ఏలుతున్న ఈ రోజుల్లో ఒక బ్యాక్ గ్రౌండ్ లేని హీరో ఎదగడం చాలా కష్టం. కానీ కొంతమంది టాలెంటెడ్ హీరోలు సక్సెస్ అయ్యి చూపించారు.
అలాంటి వారిలో ఒక్కడు సిద్దు జొన్నలగడ్డ. ‘డీజే టిల్లు’ చిత్రానికి ముందు ఈ హీరో పలు చిత్రాల్లో హీరోగా చేసాడు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అంతకు ముందు ఇతగాడు క్యారక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించాడు. ‘డీజే టిల్లు’ తో అతని జీవితమే మారిపోయింది. ఇప్పుడు యూత్ లో సిద్దు జొన్నలగడ్డ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇప్పుడు ఆయన ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ లో నటించాడు. మార్చి 29 న ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సిద్దు పోలీసులు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాలలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ ‘నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ఒక పరీక్ష రాసి ఇంటికి తిరిగి బైక్ మీద వేగంగా వెళ్తున్నాను. వెనుక నుండి నా స్నేహితులు కూడా నన్ను వాళ్ళ బైక్ తో ఫాలో అవుతున్నారు. ఒక స్నేహితుడు నన్ను ఓవర్ టెక్ చెయ్యాలని వేగంగా దూసుకొచ్చాడు. అప్పుడు నేను కూడా 70 స్పీడ్ లో వెళ్తూ ఉన్నాను. ఇద్దరి బైక్స్ గుద్దుకున్నాయి. నా హెల్మెట్ ముందు భాగం మొత్తం బాగా దెబ్బ తినింది. ముందుభాగం లో పెద్ద హోల్ పడింది. ఆరోజు నేను హెల్మెట్ వేసుకోక పొయ్యుంటే ఆ హోల్ నా తలకి పడేది. స్పాట్ లో చనిపోయేవాడిని. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళకు నేను మా స్నేహితులతో కలిసి కార్ లో వెళ్తున్నాను. నా స్నేహితుడు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆ సమయం లో కారుకి ఎదో అడ్డు రావడం తో కారు 360 డిగ్రీలకు రోల్ అయ్యి పల్టీలు కొట్టింది. అంత పెద్ద ప్రమాదం జరిగితే మాకెవ్వరికి చిన్న గీత కూడా పడలేదు, అందుకు కారణం మేమంతా సీట్ బెల్ట్ పెట్టుకోవడమే’ అంటూ చెప్పుకొచ్చాడు సిద్దు జొన్నలగడ్డ.