Allu Arjun ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతని అల్లు అర్జున్ సాధించారు. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా… ఇప్పటికి ఒకే ఒక్కడుగా నిలిచారు. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల పరంగానే కాకుండా… పురస్కారాల్లోనూ తగ్గేదేలే అని చాటి చెప్పాడు ఈ పుష్ప. వందలాది చిత్రాలతో ఎంతోమంది మేటి కథానాయకులు పోటీపడగా… ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో నటనకిగానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.
ఈసారి ఉత్తమ నటులు విభాగంలో వివిధ భాషల నుంచి ఉద్ధండులైన ఎంతోమంది కథానాయకులు పోటీపడ్డారు. తెలుగు నుంచే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ గట్టిపోటీని ఇచ్చారు. కానీ పుష్పకే కిరీటం దక్కింది. పుష్ప కచ్చితంగా పార్టీ చేసుకోవల్సిన సమయమే ఇది. అల్లు అర్జున్‌ని స్టైలిష్ స్టార్ అని పిలుచుకునేవాళ్లు అభిమానులు. ప్రతి సినిమాలోనూ తన స్టైల్‌తో ప్రత్యేకతని ప్రదర్శించేవాళ్లు. వాణిజ్య హంగులతో రూపొందే తెలుగు సినిమాకి తగ్గ కథానాయకుడు అనిపించుకున్నారు. అందుకే తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగాడు. అయితే గత చిత్రాలన్నీ ఒకెత్తు… ‘పుష్ప: ది రైజ్’ మరో ఎత్తు. అంత స్టైల్‌గా కనిపించిన అల్లు అర్జున్ ఈ సినిమాతో పూర్తిగా మారిపోయాడు.
పాత్ర కోసం ఓ మొరటు మనిషిగా మారిపోయాడు. ఆ పాత్రకి తగ్గట్టుగానే ఆయన హావభావాల్ని కూడా మార్చుకున్నాడు. దట్టమైన అడవుల్లో కిలోమీటర్లు నడుస్తూ… మేకప్ కోసమే గంటలకొద్దీ సమయం కేటాయిస్తూ పుష్పరాజ్ పాత్రలో నటించారు. జాతీయ పురస్కారంతో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించినట్టైంది. అల్లు అర్జున్ తన పాత్రలో ఒదిగిపోయిన విధానం చూసేనేమో ఆయన పేరు మార్చారు దర్శకుడు సుకుమార్. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అని కొత్తగా నామకరణం చేశారు. ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ఆయన ఓ ఐకాన్‌గా నిలిచారు. ఇదంతా పేరు మార్చాడం వల్లేనని పేరు మార్చాకా బన్నీ ఫేట్ మారిందని కొందరు అనుకుంటున్నారు.