తమిళ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన దర్శకులలో లోకేష్ కనగరాజ్ ఒకరిగా కొనసాగుతున్నారు. విలక్షణమైన స్టోరీలతో సినిమాలు తీస్తూ వరుస హిట్స్ అందుకుంటున్నారు. లోకేష్ ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా ‘లియో’ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. కేవలం ఐదేళ్లలో లోకేష్ అంటే ఏంటో దేశానికి తెలిసేలా చిత్రాలను తీశాడు. 2017లో ‘మానగరం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. లోకేశ్ కనగరాజ్ సినీ విశ్వం ప్రారంభించి మాఫియా, పోలీస్ నేపథ్యంలో వినూత్న చిత్రాలను రూపొందిస్తున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కనగరాజ్.. తన సినీ కెరీర్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తనకు ఎక్కువ సినిమాలు చేసే ఆలోచన లేదని చెప్పాడు. కేవలం 10 సినిమాలే చేస్తానని అవి కంప్లీట్ అయ్యాక ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అంటే మరో రెండు, మూడు సినిమాల తర్వాత లోకేష్ సినిమాలకు ఫుల్ స్టాఫ్ పెట్టే అవకాశం ఉంది. తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం హాలీవుడ్ దర్శకుడు క్వింటెన్ టరాన్టినో అని చెప్పాడు. తన లాగే పది చిత్రాలకు దర్శకత్వం వహించి సినిమా పరిశ్రమ నుంచి తప్పుకుంటానన్నారు. నాకు నచ్చిన కథలు చెప్పడానికే వచ్చాను. మొదట షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నా ప్రతిభను నిరూపించుకున్నాను. పది సినిమాలే చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతాను’’ అని లోకేశ్ కనకరాజ్ అన్నారు.