Sirhari – Venkatesh : ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చెయ్యడం మన టాలీవుడ్ లో కొత్తేమి కాదు, దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. అలా చేసిన సినిమా హిట్ అవ్వడమో, లేదా ఫ్లాప్ అవ్వడమో జరుగుతూ వచ్చింది. కానీ కొంతమంది హీరోలకు మాత్రం ఆ సినిమాలు మిస్ అవ్వడం వల్ల కెరీర్ మరో లెవెల్ కి వెళ్లలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా ప్రముఖ హీరో రియల్ స్టార్ శ్రీహరి విషయం లో కూడా జరిగింది.

క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కెరీర్ ని ప్రారంభించిన శ్రీహరి, ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో సక్సెస్ లను అందుకున్నాడు. అనతి కాలం లోనే మాస్ ఆడియన్స్ కి ఎంతో దగ్గరయ్యాడు. అలా హీరో గా దూసుకుపోతున్న సమయం లో యెన్ శంకర్ అనే దర్శకుడు శ్రీహరి కి ‘జయం మనదేరా’ సినిమా స్టోరీ చెప్పాడు. కథ శ్రీహరి కి తెగ నచ్చేసింది, వెంటనే డేట్స్ ఇచ్చేసాడు.

అయితే అదే సమయం లో రామానాయుడు నుండి యెన్ శంకర్ కి కబురు అందింది. ఏదైనా స్క్రిప్ట్ ఉంటే తీసుకొనిరా, వెంకటేష్ బాబు తో సినిమా చేద్దాం అన్నాడట. వెంకటేష్ లాంటి సూపర్ స్టార్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కితే ఎవరు మాత్రం కుదురుగా ఉంటారు చెప్పండి. యెన్ శంకర్ కూడా ఆ ఛాన్స్ వదులుకోలేదు, కానీ తన దగ్గర అప్పటికీ ‘జయం మనదేరా’ స్క్రిప్ట్ తప్ప మరొకటి లేదు. రామానాయుడు ని కలిసి ఈ స్క్రిప్ట్ శ్రీహరి గారికి ఓకే అయిపోయింది, వేరే కథ చేద్దాం అన్నాడట.

కానీ రామానాయుడు మాత్రం ఈ స్క్రిప్ట్ వెంకటేష్ తో చెయ్యి, శ్రీహరి తో వేరే సినిమా చేసుకో అన్నాడట. అంత పెద్ద లెజెండ్ నిర్మాత అడిగటంతో కాదు అనలేక ఈ స్క్రిప్ట్ ని వెంకటేష్ తో చేసాడు. ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి, వెంకటేష్ కి మంచి మాస్ ఇమేజి ని తెచ్చిపెట్టింది. ఒకవేళ ఈ సినిమా శ్రీహరి చేసి ఉంటే, ఆయన కూడా స్టార్ అయ్యేవాడేమో.