నటీనటలు : ప్రియదర్శి, నబ్బా నటేష్, అనన్య నాగేళ్ల, మురళి గౌడ్, విష్ణు, కృష్ణ తేజ్, సుహాస్, నిహారిక కొణిదెల, బ్రహ్మానందం.
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : నరేష్
మాటలు : హేమంత్
రచన, దర్శకత్వం : అశ్విన్ రామ్
నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
Darling Movie review కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించి మంచి గుర్తింపుని దక్కించుకున్న ప్రియదర్శి, హీరో గా కూడా విభిన్నమైన కథలతో విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని ఏర్పాటు చేసుకున్న ప్రియదర్శి హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డార్లింగ్’. నబ్బా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. టీజర్, ట్రైలర్ తో సరికొత్త కథాంశంతో రాబోతున్న చిత్రాన్ని చూడబోతున్నాం అనే అనుభూతి కలిగించిన ఈ చిత్రం, నేడు ప్రేక్షకుల చేత కూడా అదే తరహా రెస్పాన్స్ ని దక్కించుకుందో లేదో చూద్దాం.
కథ :
రాఘవ (ప్రియదర్శి) ఒక ట్రావెల్ ఏజెన్సీ లో పని చేసే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి. ఇతనికి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని, ప్యారిస్ కు హనీమూన్ వెళ్ళాలి అనే కోరిక ఉంటుంది. ఆ కోరికతో భాగంగానే అతని తండ్రి (మురళి గౌడ్) ఒక సైకాలజిస్ట్ నందిని (అనన్య నాగేళ్ల) తో పెళ్లి సంబంధం కుదిరిస్తాడు. అలా పెళ్లికి సిద్దమై మండపం లో కూర్చున్న రాఘవ ని కాదని, నందిని తాను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతుంది. అలా పెళ్లి పెటాకులు అవ్వడంతో జీవితం మీద విరక్తి కలిగి రాఘవ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు.
సరిగ్గా ఆ సమయానికి ఆనంది (నబ్బా నటేష్) అతని జీవితం లోకి అడుగుపెడుతుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డ రాఘవ వెంటనే ప్రపోజ్ చేస్తాడు. ఆనంది కూడా ఒప్పుకుంటుంది. ఇక ఆ తర్వాత వెంటనే పెళ్లి కూడా జరిగిపోతుంది. అయితే మొదటి రాత్రే ఆనంది చేతిలో దెబ్బలు తింటాడు రాఘవ. అందుకు కారణం ఆనంది మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతూ ఉండడమే. మరి ఈ అపరిచితుడు లాంటి క్యారక్టర్ ఉన్న అమ్మాయితో రాఘవ తన దాంపత్య జీవితం ఎలా కొనసాగించాడు?, అతని జీవితం లో ఎదురైనా పరిణామాలు ఏమిటి?, ఆనంది లో ఉన్న 5 పర్సనాలిటీస్ (ఆది, మాయ, ఝాన్సీ, పాప, శ్రీశ్రీ) ఎవరు ?, వారి లక్ష్యాలు ఏమిటి?, ఎందుకు ఆనంది కి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది చూడాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
చాలా విభిన్నమైన కథతో డైరెక్టర్ అశ్విన్ రామ్ ఎంచుకున్న పాయింట్ ని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఈ కథాంశం తో అద్భుతమైన వినోదాన్ని పంచొచ్చు. సరిగ్గా వాడుకుంటే ఈ పాయింట్ మీద బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురుస్తుంది. కానీ డైరెక్టర్ ఈ విషయం లో సగం సక్సెస్ అయ్యాడు, సగం ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ప్రథమార్థం మొత్తం హాస్యభరితంగా సన్నివేశాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నం లో కొంతమేరకు సక్సెస్ అయ్యాడు అనే చెప్పొచ్చు. పెళ్లి మండపం లో పెళ్లి క్యాన్సిల్ అయ్యాక జరిగిన కొన్ని సంఘటనలు ప్రేక్షకుల చేత నవ్వులు పూయిస్తాయి.
ఆ తర్వాత నబ్బా నటేష్ ని పెళ్లాడిన తర్వాత, ఆమె గురించి తెలుసుకున్నాక జరిగే సంఘటనలు కూడా హాస్య భరితంగా ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడికి సినిమాని కామెడీ పరంగా తియ్యాలా?, లేదా ఎమోషనల్ గా తియ్యాలా అనే అయ్యోమయ్యం స్పష్టంగా కనిపిస్తుంది. తన భార్య కి ఉన్న ఈ మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ జబ్బుని తగ్గించేందుకు హీరో చేసే ప్రయత్నాలు చాలా సినిమాటిక్ గా, సిల్లీ గా అనిపిస్తాయి. అలా ఒక అద్భుతమైన పాయింట్ ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.
ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రియదర్శి ఎప్పటి లాగానే తన సహజమైన నటనతో ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేసాడు. తన కామెడీ టైమింగ్ తో అనేక సన్నివేశాల్లో నవ్వులు పూయించాడు. ఇక హీరోయిన్ నబ్బా నటేష్ ఛాలెంజింగ్ రోల్ చేసిందనే చెప్పాలి. తన పరిధిమేర చాలా చక్కగా నటించింది, కానీ ఆమె డబ్బింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే బాగుండేది అనిపించింది. సుహాస్, అనన్య నాగేళ్ల, నిహారిక కొణిదెల, బ్రహ్మానందం అతిథి పాత్రల్లో మెరిశారు. ఎంచుకున్న కథాంశం బాగానే ఉన్నప్పటికీ కామెడీ ని , ఎమోషనల్ సీన్స్ ని బ్యాలన్స్ చెయ్యడం లో డైరెక్టర్ విఫలం అయ్యాడు. ఆ ఒక్కటి చేసి ఉంటే ఈ సినిమా రేంజ్ నేడు వేరే లెవెల్ లో ఉండేది.
చివరి మాట:
కాసేపు టైం పాస్ చేద్దాం అని థియేటర్ కి వెళ్లేవారికి మాత్రం ఈ చిత్రం పర్వాలేదు అనిపిస్తుంది, డైరెక్టర్ చేసిన ప్రయత్నం కి ఒక్కసారి చూడొచ్చు.
రేటింగ్ : 2.5/5