అక్కినేని ఫ్యామిలీ హీరోలు రీసెంట్ గా చేసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. గత ఏడాది అక్కినేని నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీ తో ఫ్లాప్ స్ట్రీక్ కొనసాగింది. ఆ తర్వాత నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రం తో దసరా కి వచ్చి మరో భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందించాడు. ఇక అక్కినేని ఫ్యాన్స్ పంచప్రాణాలు గా భావించిన ‘ఏజెంట్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై కనీసం వారం రోజులు కూడా థియేటర్స్ లో ఉండలేకపోయింది. ఇలా వరుసగా ఫ్లాప్స్ రావడం వల్ల అక్కినేని ఫ్యాన్స్ చాలా తీవ్రమైన నిరాశలో ఉన్నారు.వాళ్లకి ఇప్పుడు భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, అలాంటి హిట్ ‘కస్టడీ’ ద్వారా వస్తుందని అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ఎంతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మరి ‘కస్టడీ’ అక్కినేని అభిమానుల ఆకలిని తీర్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాము.

కథ :
శివ (నాగ చైతన్య) ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, ఎంతటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా చట్టాన్ని తూచా తప్పకుండ అనుసరించాలి అనుకునే వ్యక్తి ఆయన. ఈయన జీవితం లో రేవతి ( కృతి శెట్టి) అనే అమ్మాయి ఉంటుంది. ఈమెని పెళ్లి చేసుకొని ప్రశాంతవంతమైన జీవితం గడపాలని అనుకుంటాడు శివ. ఇది ఇలా ఉండగా సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్ రాజన్న (అరవింద్ స్వామి ) అని అరెస్ట్ చేసి ఉంచుతారు పోలీసులు. అప్పుడు డ్యూటీ లో ఉన్న శివకి రాజన్న ని అతని శత్రువులు చంపేయబోతున్నారు అనే విషయం తెలుస్తుంది, అదే సమయం లో రేవతి కి కూడా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. అయితే ఎలా అయినా న్యాయం గెలవాలని పరితపించే శివ , ఆరోజు రాత్రి రాజన్న ని అలాగే, తానూ ప్రేమించిన రేవతి ని తీసుకెళ్తాడు, రాజన్న ని చట్టబద్దం గా కోర్టులో అప్పగించాలని అనుకుంటాడు. మరో పక్క పోలీసులు రాజన్న మరియు శివ గురించి గాలింపులు మొదలుపెడతారు.ఇంతకీ రాజన్న ని చంపాలనుకున్నది ఎవరు, శివ ఎలాంటి పోరాటాలు చేసాడు అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :
ఈ సినిమాని డైరెక్టర్ వెంకట్ ప్రభు 1996 వ సంవత్సరం జరిగిన కథగా చూపిస్తాడు. సినిమా ప్రారంభమే చాలా స్లో గా ఉంటుంది. నాగ చైతన్య మరియు కృతి శెట్టి మధ్య వచ్చే సన్నివేశాలను డైరెక్టర్ సరిగా రాసుకోలేదు. దానికి తోడు వెన్నెల కిషోర్ తో చేయించిన కామెడీ సినిమా ఫ్లో కి అడ్డం గా మారి ఆడియన్స్ కి చిరాకు కలిగిస్తుంది. అయితే అరవింద్ స్వామి, శరత్ కుమార్ వంటి నటుల ఎంట్రీ తో సినిమా స్క్రీన్ ప్లే కాస్త వేగాన్ని అందుకుంది. కానీ చేసింగ్ సన్నివేశాల కోసం నిర్మాత బడ్జెట్ విషయం లో చాలా కక్కుర్తి పడ్డాడు అని చూసేవాళ్లకు అనిపిస్తుంది. ఎంతో ఆసక్తికరంగా ప్రేక్షకులు చూడాల్సిన ఈ చేసింగ్ సన్నివేశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి.ఇది కచ్చితంగా నిర్మాత లోపమే, అయితే సెకండ్ హాఫ్ కోసం ఇంటర్వెల్ బ్లాక్ ని ఆసక్తికరంగా ఉండేలా పెట్టాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు.

ఇక ఒక సినిమాకి ఆయువు పట్టు లాగ ఉండేది సంగీతం, కంటెంట్ లేని సినిమాలు కూడా సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణంగా సూపర్ హిట్స్ గా నిలిచినవి ఎన్నో ఉన్నాయి. కానీ ఈ సినిమాలో ఒక్క పాట కూడా వినసొంపుగా ఉండదు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంతమాత్రమే, యువన్ శంకర్ రాజా మరియు ఇళయరాజా నుండి ఇలాంటి సంగీతం ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇక నటీనటుల విషయానికి వస్తే నాగ చైతన్య తన పాత్రలో జీవించేసాడు అనే చెప్పాలి,అరవింద్ స్వామి మరియు శరత్ కుమార్ లు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ, ఇక కృతి శెట్టి కూడా పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో సన్నివేశాలన్నీ రొటీన్ అనిపించడం తో ఆడియన్స్ కి కాస్త చిరాకు కలిగిస్తుంది.
చివరి మాట :
యాక్షన్ థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు, కానీ సెకండ్ హాఫ్ మొత్తం రొటీన్ అనిపించడం వల్ల కాస్త ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది ఈ చిత్రం.
రేటింగ్ : 2.5/5