తన స్నేహితురాలు, నటి సమంత ను ఉద్దేశిస్తూ గాయని చిన్మయి తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. సమంత ఒక స్ఫూర్తి అంటూ ఆమె పేర్కొన్నారు. జీవితం, కెరీర్‌కు సంబంధించిన పలు విషయాల్లో సమంతను ప్రేరణగా తీసుకోవాలని ఆమె చెప్పారు. సోషల్‌మీడియా వేదికగా నిందలు వేసేవారిని ఉద్దేశిస్తూ.. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడారు. అందరి దృష్టిని ఆకర్షించి డబ్బులు సంపాదించడం కోసం అసభ్యకరంగా మాట్లాడితే ఏదో ఒక రోజు ఇబ్బంది ఎదుర్కొంటారని అన్నారు.
‘‘ఎన్ని నిందలు ఎదురైనా హుందాగా ముందుకు ఎలా సాగాలో నేర్చుకోవాలంటే సమంతను స్ఫూర్తిగా తీసుకోండి. తన అనారోగ్యం కారణంగా ఓ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఆ ప్రాజెక్ట్ కోసం తన పారితోషికాన్ని తగ్గించుకుంది. వచ్చే డబ్బును వద్దనే వారు ఈ కాలంలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. సోషల్‌మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వచ్చినప్పుడు.. తాను మయోసైటిస్‌తో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పి.. ఆ సమస్యపై అందరికీ అవగాహన కల్పించడానికి తను ఎంతో కష్టపడుతోంది. ‘ఈ అమ్మాయి కెరీర్ అయిపోయింది’ అని పలువురు కామెంట్ చేస్తున్న సమయంలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి తన సత్తా చాటుతోంది.
ఎవరు ఎన్ని రకాలుగా దూషించినా.. అసభ్యకరంగా మాట్లాడినా వాటిని పట్టించుకోకుండా జీవితంలో ముందుకు సాగుతోంది. ట్విటర్‌లో ఎంగేజ్‌మెంట్స్, మానిటైజేషన్ అనే గోలతో కొంతమంది ఇటీవల నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. కర్మ సిద్ధాంతం అనేది ఎంతో ఆసక్తి కలిగిన అంశం. ఒకరి గురించి అదే పనిగా అబద్ధాలు చెబుతూ దూషిస్తూ ఉంటే ఆ పాపం మొత్తం పేరుకుని ఏదో ఒకరోజు మనకే ఎదురుతిరుగుతుంది. డబ్బులు సంపాదించినా.. ఆస్తులు ఉన్నా ఏం లాభం లేదు. తరతరాలకు ఆ కర్మ ఫలం వర్తిస్తుంది. అది ఒక్కసారి మొదలైతే.. వినోదం మామూలుగా ఉండదు.’’ అని ఆమె పేర్కొన్నారు.