Meenakshi Thapa : ఇండస్ట్రీలోకి రావాలి సెలబ్రిటీలుగా మారిపోవాలని చాలమంది కలలు కంటుంటారు. అలా ఎన్నో ఆశలతో అడుగుపెట్టి అష్టకష్టాలు పడి గుర్తింపు తెచ్చుకునే వాళ్లు కొందరైతే.. నటనలో కలిసి రాక అనతి కాలంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యే వారు మరికొందరు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఊహించని ఘటనతో ఇండస్ట్రీకి కాదు.. ఏకంగా తన జీవితానికే ముగింపు పలికింది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ నెమ్మదిగా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అప్పుడప్పుడే మంచి అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న టైంలోనే ఊహించిని ఘటన ఆమెకు ఎదురైంది. షూటింగ్ సెట్ నుంచి ఆ ఆమెను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి.. ఆపై తల నరికి బస్సులో నుంచి బయట పడేశారు. ఇదేదో సినిమా స్టోరీ కాదు.. సినిమాను తలపించే రియల్ స్టోరీ.. 2012లో యావత్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది ఈ ఘటన. ఇప్పటికీ ఆమె మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేస్తుంది. తోటీ నటీనటులే ఆమెను దారుణంగా చంపారని తెలిసి పోలీసులే నిర్ఘాంతపోయారు.
ఆమె పేరు మీనాక్షి థాపా. 1984 అక్టోబర్ 4న నేపాల్‌లో జన్మించి డెహ్రాడూన్‌లో పెరిగింది. చదువుకుంటున్న సమయంలోనే ఇండస్ట్రీ మీద ఇంట్రెస్టుతో ముంబైకి చేరుకుంది. ముంబైలో డ్యాన్స్ శిక్షణ తీసుకుని.. 2011లో 404 సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తర్వాత ఆమెకు స్టార్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ తెరకెక్కించిన హీరోయిన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో కరీనా కపూర్ మెయిన్ లీడ్ రోల్ పోషించగా.. మరో కథానాయికగా మీనాక్షి నటించాల్సి ఉంది. అతి తక్కువ సమయంలో కరీనా వంటి స్టార్ హీరోయిన్ పక్కనే కీలకపాత్ర అవకాశం రావడంతో ఫుల్ ఖుషీ అయింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. హీరోయిన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న మీనాక్షి.. షూటింగ్ సెట్ నుంచి కిడ్నాప్ కు గురైంది. ఆ సమయంలో తన వయసు కేవలం 24 ఏళ్లు మాత్రమే. మీనాక్షి తన తల్లికి ఫోన్ చేసి తన సహనటుడు, స్నేహితుడు అమిత్ కుమార్ జైస్వాల్, ప్రీతి సూరిన్ లతో కలిసి అలహాబాద్ వెళ్తునట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది. రెండు రోజులైనా ఆమె జాడ తెలియరాలేదు.
ఆ తర్వాత ఆమె తల్లికి తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. మీ అమ్మాయి క్షేమంగా ఇంటికి రావాలంటే రూ. 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులకు చెబితే తమ కూతురి అశ్లీల వీడియోలను బయటపెడతామని బెదిరించారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా.. ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. మీనాక్షిని ఆమె ఇద్దరు స్నేహితులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలహాబాద్ లో ఆమెను కిడ్నాప్ చేసి దారుణంగా హింసించారు. కొన్నాళ్లకు అమిత్, ప్రీతి సూరిన్ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. మీనాక్షి హత్యోందంతం వెలుగులోకి వచ్చింది. రూ. 15 లక్షలు చెల్లించిన తర్వాత వారు మీనాక్షి గొంతు కోసి హత్య చేసి.. ఆ తర్వాత ఆమె తల నరికి ముంబైకి తిరిగి వచ్చే దారిలో బస్సు కిటికిలో నుంచి బయట పడేసినట్లు వారు పోలీసుల విచారణలో అంగీకరించారు. మీనాక్షి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్ లో పడేశారు. అయితే మీనాక్షి తలను కానీ.. ఆమె బాడీని కానీ పోలీసులు కనిపెట్టలేకపోయారు. 2018లో అన్ని విచారణ జరిగిన తర్వాత కోర్టు వారిద్దరికి జీవిత ఖైదు విధించింది.