Bobby Deol : బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల విడుదలైన యానిమల్ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తన సినిమాలతో అతను ప్రజల హృదయాలకు చాలా దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన తన అభిమానులకు లార్డ్ బాబీ డియోల్ అయ్యాడు. బాబీ తన తండ్రి ధర్మేంద్ర అంత స్టార్‌డమ్‌ని సంపాదించలేకపోయినా, అతని వ్యక్తిత్వం చాలా మందిని ఆకర్షించింది. ఈరోజు బాబీ తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంతో బాబీ డియోల్ తన జీవితంలో ఓ లవ్ ఫెయిల్యూర్ అన్న సంగతిని గుర్తు చేసుకుందాం.
బర్సాత్ సినిమాతో కెరీర్ ప్రారంభించాడు బాబీ డియోల్. ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. కెరీర్ మధ్యలో బాలీవుడ్ నటి నీలం కొఠారితో ప్రేమలో పడ్డాడు. నీలం, బాబీ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. కానీ, బాబీ తండ్రి ధర్మేంద్ర వారి ప్రేమకథలో విలన్ అయ్యాడు. అతని తండ్రి కారణంగా బాబీ తన ఫస్ట్ లవ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. నీలం కొఠారితో తన జీవితాన్ని పంచుకోవాలనుకున్న బాబీ ఆశ నెరవేరలేదు.
బాబీ, నీలంల ప్రేమ గురించిన చర్చలు ఇప్పటికీ బాలీవుడ్ కారిడార్‌లలో ప్రతిధ్వనిస్తున్నాయి. వారిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నారని.. అయితే వారి తండ్రి ధర్మేంద్ర ఈ సంబంధాన్ని అంగీకరించలేదని తెలుస్తోంది. నీలమ్‌తో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదని, అయితే పరిశ్రమకు చెందిన ఏ నటి కూడా తన కోడలు కావడం తనకు ఇష్టం లేదని ధర్మేంద్ర చెప్పినట్లు సమాచారం.
దీంతో తండ్రి మాటను కాదనలేక నీలమ్‌ని పెళ్లి చేసుకోకూడదని బాబీ నిర్ణయించుకోవడంతో వారి ప్రేమకు శుభంకార్డు పడింది. ఐదేళ్ల పాటు వారి ప్రేమాయణం సాగింది. వారిద్దరు విడిపోయిన తర్వాత బాబీ 1996లో వ్యాపారవేత్త అయిన తాన్యా అహుజాను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. బాబీ తన కుటుంబంతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటాడు.