Keerthi : ప్రస్తుతం సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. కొంత మంది సైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త ఆలోచనలతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ సైబర్ ట్రాప్ లో పడి లక్షలకు లక్షలు పోగొట్టుకోగా.. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ కీర్తిభట్ కూడా వారి వలలో చిక్కుకుని రూ. 2 లక్షలు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఆమె మాట్లాడుతూ.. ‘నాకు ఒక ఇంపార్టెంట్ కొరియర్ రావాల్సి ఉండి.. అది వారం రోజులుగా రాకపోవడంతో మెయిన్ కొరియర్ సెంటర్ వాళ్లకి కాల్ చేశాను. వాళ్లు డెలవరీ చేశాము.. మెహదీపట్నంలో ఉందన్నారు. ట్రాక్ చేసి చూస్తే నిజంగానే మెహదీపట్నంలో ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాత నాకొక కాల్ వచ్చింది. వాళ్లు హిందీలో మాట్లాడుతూ.. ‘మీకొక కొరియర్ రావాలి కదా.. మీ లోకేషన్ అడ్రస్ అప్‌డేట్ కాలేదు. ఒకసారి వాట్సాప్ ద్వారా మీ అడ్రస్ పంపించండి’ అన్నారు. వారి చెప్పినట్లే చేశారు. తర్వాత మళ్లీ కాల్ చేసి మీ అడ్రస్ అప్‌డేట్ కావడం లేదు. ఒకసారి నార్మల్ మెసేజ్ చేయండి అంటే చేశాను. నాకు లింక్ వచ్చింది. అది కాపీ చేసి వాట్సాప్ నంబర్‌కి పంపమన్నారు. తర్వాత ముందు పంపిన వాట్సాప్ నెంబర్‌కి అదే లింక్‌ని ఫార్వర్డ్ చేసి దాన్ని ఓపెన్ చెయ్యమన్నారు. అలాగే అడ్రస్ అప్‌డేట్‌కు రూ. 2 ఎక్స్‌ట్రా కట్ అవుతుందన్నారు.
రూ.2లే కదా అని లింక్ క్లిక్ చేశాను. తర్వాత యూపీఐ ఎంటర్ చెయ్యమన్నారు. నాకు డౌట్ వచ్చి చేయనని చెప్పాను. అప్పుడు వాళ్లు బ్యాంక్‌కి లింక్ అయిన నంబర్ ఇదేనా అని అడిగితే.. అవునని చెప్పాను. సరే మీకు మళ్లీ కాల్ చేస్తామని చెప్పారు. నాకు ప్రొసెసింగ్ అని పడింది. తర్వాతకి రూ.2 కట్ అయ్యాయి. లైట్ తీసుకున్నాను. అర్థరాత్రి రూ. 99 వేలు కట్ అయ్యాయి. ఆ తర్వాతకి మరో రూ. 99 వేలు కట్ అయ్యాయి. నాకు ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే కార్తీక్‌కి కాల్ చేశాను. ఇద్దరం కలిసి సైబర్ కంప్లైంట్ ఇచ్చాము. వారు నా అకౌంట్‌ను బ్లాక్ చేయించారు. అలాగే వాళ్లను వీళైనంత తొందరగా పట్టుకుని నా డబ్బులు నాకు ఇప్పిస్తామన్నారు. కానీ ఏది ఏమైనా ఇలాంటి సైబర్ నేరాల భారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్లో చెప్పుకొచ్చింది బ్యూటీ.