‘Pallavi Prashanth : బిగ్‌బాస్ సీజన్-7’లోకి అడుగు పెట్టే ముందు వేదికపై తన పొలంలోని మట్టి, తాను పండించిన బియ్యాన్ని నాగార్జునకు గిఫ్ట్‌గా ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక మిరప మొక్కను అతనికిచ్చి, ‘దీన్ని బాగా చూసుకో. కాయలు కాస్తే, అందుకు తగినట్లు నీకు స్పెషల్ గిఫ్ట్‌లు ఇస్తా’ అని చెప్పారు. అయితే, కొన్ని రోజులకు ఆ మొక్క ఎండిపోవడంతో నాగార్జున చివాట్లు పెట్టి, మరో మొక్కను పంపారు. దాన్ని సీజన్ చివరి వరకూ జాగ్రత్తగా పెంచాడు. ఈ హౌస్‌లో ఉన్నన్ని రోజులు ఆ మొక్క ఉంచిన ప్రదేశమే తన బెస్ట్ ప్లేస్ అంటూ ప్రశాంత్ చెప్పడం గమనార్హం. బిగ్‌బాస్ సీజన్-7లో పల్లవి ప్రశాంత్‌కు అత్యంత దగ్గరైన వ్యక్తులు నటుడు శివాజీ, మోడల్ యావర్. వీరి ముగ్గురికి(స్పై) (శివాజీ, ప్రశాంత్, యావర్) అనే పేరు కూడా వచ్చింది.

ఈ ముగ్గురూ ఫైనలిస్ట్‌లు కూడా అయ్యారు. పల్లవి ప్రశాంత్ హౌస్‌లోకి అడుగు పెట్టి వెంటనే ఇంటి సభ్యులను పరిచయం చేసుకునే క్రమంలో టేస్టీ తేజ ఎదురు వచ్చి, ‘ఇదేంటి నీకు మొక్క ఇచ్చారు’ అని అడగ్గా, అక్కడే ఉన్న శివాజీ ‘వెళ్లేటప్పపుడు కప్పుతో పాటు మొక్కనూ పట్టుకెళ్తాడులే’ అని అన్నాడు. అప్పుడు శివాజీ అన్న మాటలు ఇప్పుడు నిజమయ్యాయనే అనుకోవాలి. ఇక ఇప్పుడు ప్రైజ్ మనీ మొత్తం రైతులకు ఇచ్చేస్తానని చెప్పి దేవుడయ్యాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్‌లో గెలుచుకున్న ప్రైజ్ మనీ రూ.35 లక్షలు.. కష్టాల్లో ఉన్న రైతులకే ఇస్తానని పల్లవి ప్రశాంత్ తెలిపాడు. బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న తర్వాత ప్రశాంత్ మాట్లాడుతూ..

‘‘రూ.35 లక్షలను రైతుల కోసం ఇస్తాను. కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్క రైతుకు ఇస్తా. పొట్ట మీద చేయి వేసుకొని చెప్తున్నా. మాట తప్పేదే లేదు. మళ్లీ వచ్చా అంటే తగ్గేదే లే. రైతుల కోసం ఆడినా, కారు నాన్నకు ఇస్తా, నక్లెస్ అమ్మకు ఇస్తా. డబ్బు జనాలకు ఇస్తా’’ అని తెలిపాడు. ‘‘ఓటు చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఒక విషయం చెబుతా. ప్రతి రోజు ఇక్కడనే తిరిగినా. తినని రోజులు కూడా ఉన్నాయి. ఇంట్లో చెప్పలేదు. వాళ్లకు తిన్నానని అబద్ధం చెప్పేవాడిని. ముందుకు నడువు, నేను వెనక ఉంటా అని బాపు మాట ఇచ్చాడు. సార్‌తో పరిచయమైంది. నాగార్జునను చూడగానే మాట రాలేదు’’ అంటూ నాగార్జునపై ఎమోషనల్‌గా కవిత చెప్పాడు ప్రశాంత్.