ఇరవై మూడేళ్ల క్రితం అక్కినేని సుమంత్ హీరోగా నటించిన ‘యువకుడు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హిందీ భామ భూమిక చావ్లా. తొలిసినిమా అంతగా పేరు తెచ్చిపెట్టలేకపోయినా.. రెండవ సినిమాకే ఏకంగా పవన్‌తో ‘ఖుషీ’లో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా భూమికకు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘వాసు’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ హీరోయిన్‌గా మారింది. దాదాపు దశాబ్ద కాలం పాటు దక్షిణాదిన తెగ బిజీగా గడిపింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ భూమిక వరుస సినిమాలతో చెలరేగిపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా భూమిక కీలకపాత్రలో నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది.

భూమిక ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. కాలంతోపాటు సమాజంలో అనేక మార్పులు సంతరించుకుంటున్నప్పటికీ సినిమాల్లో మాత్రం హీరోయిన్ల పరిస్థితిలో మార్పు రావడం లేదని, ఫలితంగా నాటి నుంచి నేటి వరకు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ప్రాధాన్యత లేదని సీనియర్ నటి భూమిక చావ్లా ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలతో పోల్చుకుంటే.. వెబ్ సిరీస్‌లలో మాత్రం హీరోయిన్‌లకు మంచి ప్రాధాన్యతే దక్కుతుందని తాజాగా భూమిక చెప్పుకొచ్చారు. సినిమాల్లో హీరోలు తనకంటే సగం తక్కువ వయసున్న హీరోయిన్లతో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని నిర్మాతలతో పాటు ప్రేక్షకులూ అంగీకరిస్తున్నారు.

అలాగే, హీరోయిన్లు కూడా తమ కంటే పెద్దవారైన హీరోల సరసన నటించేందుకు సమ్మతిస్తున్నారు. ఈ విధానం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాకపోతే వెబ్ సిరీస్‌ల విషయంలో మాత్రం హీరోయిన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ.. సినిమాల విషయంలో మాత్రం ఇంకా పాత విధానమే కొనసాగుతోంది అని చెప్పింది. ఇక ఇటీవలే తన కెరీర్లోనూ కొన్ని సినిమాల నుంచి తనను తీసేశారని చెప్పి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా బాధపడిన ఓ సంఘటన గురించి నటి భూమిక (Bhumika) మొదటిసారి వెల్లడించారు. ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలో మొదట తననే హీరోయిన్‌గా అనుకుని.. తర్వాత తన స్థానంలో మరో హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్నారని అది తనని ఎంతో బాధపెట్టిందని ఆమె చెప్పారు.