రాజకీయాల్లో ఉన్న లేకపోయినా తెలుగు దేశం పార్టీ ప్రస్తావన వస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు కచ్చితంగా చర్చలోకి వస్తుంది. 2009 వ సంవత్సరం లో తెలుగు దేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చేసిన ఎన్టీఆర్, ఆ తర్వాత కొద్దిరోజులు పార్టీ కార్యకలాపాల్లో యాక్టీవ్ గా ఉండేవాడు కానీ, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమై సినిమాలు మాత్రమే చేసుకుంటూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా వస్తాను అని ఎన్టీఆర్ అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టిమరీ చెప్పాడు, కానీ ఇప్పటి వరకు తెలుగు దేశం పార్టీ వైపే చూడలేదు. 2009 నుండి ఇప్పటి వరకు తెలుగు దేశం పార్టీ కి ఎన్నో కష్టాలు వచ్చాయి, సంక్షోభాల్లో పడింది, కానీ ఎన్టీఆర్ నుండి నో రెస్పాన్స్. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు అరెస్ట్ అయ్యి మూడు వారాల నుండి జైలు లో ఉన్నా కూడా ఎన్టీఆర్ పట్టించుకోలేదు.

ఇదంతా పక్కన పెడితే అప్పట్లో బాలయ్య చిన్న కూతురు తేజస్విని భర్త భరత్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు పెను దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ లోకి వస్తే పార్టీ కి ఏమైనా మేలు జరుగుతుందా అని అడగగా, ఆయన పార్టీలోకి రావడం వల్ల కొత్తగా జరిగే మేలు ఏమి లేదు అని బదులిస్తాడు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియా లో పెద్ద వివాదాలకు దారి తీసింది. మళ్ళీ రీసెంట్ గా భరత్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘గతం లో నేను ఎన్టీఆర్ గురించి మాట్లాడినప్పుడు పెద్ద దుమారం రేగింది. కానీ అప్పట్లో నేను మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదు, కానీ చెప్పిన టోన్ కరెక్ట్ కాదు అనిపించింది, అందుకే గొడవలు అయ్యాయి, తెలుగు దేశం పార్టీ అనేది కేవలం వ్యక్తి కష్టం కాదు, వేలాది మంది కార్యకర్తలు, వందలాది మంది నాయకుల సమిష్టి కృషి. కచ్చితంగా ఈ పార్టీ కి నాయకుడు కావాలి, గతం లో ఎన్టీఆర్ గారు , ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ కి న్యాయకత్వం వహించారు, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నాయకత్వం వహిస్తారేమో చూద్దాం’ అంటూ కామెంట్ చేసాడు.