Rocking Rakesh : తెలుగులో జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు రాకింగ్ రాకేష్. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా పలు సినిమాలలో ఇప్పటికే అవకాశాలు దక్కించుకుని మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా తానే హీరోగా నటిస్తూ కేసీఆర్ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా తీయడానికి తను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లును కూడా తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకేష్ షాకింగ్ విషయాలు బయట పెట్టారు. కొంతమంది తనని మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో చిన్న చితకా పాత్రలు చేసే రాకేష్ ఏకంగా కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది కేసీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. ఆయనపై ఉన్న ఇష్టంతోనే ఈ సినిమా స్వయంగా తానే తీస్తున్నానని రాకేష్ తెలియజేయడం జరిగింది.
సినిమా అంటే కోట్ల వ్యవహారం కదా అంత డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయని యాంకర్ ప్రశ్నించగా తను కట్టుకున్న ఇంటిని తాకట్టు పెట్టి ఈ సినిమా తీశానని తెలిపారు. బినామీ డబ్బులతో నిర్మిస్తున్నానన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశాడు. గతంలో ఈ సినిమా చేస్తానని కొంతమంది వ్యక్తులు తనకి మాటిచ్చి.. వెనక్కి తగ్గారని దీంతో గత్యంతరం లేక ప్రొడ్యూసర్ గా మారాల్సి వచ్చిందని రాకేష్ తెలిపాడు. అలాగే ఒక రైటర్ కూడా తనను నమ్మించి మోసం చేశాడని.. సినిమా మొదలు కాక ముందే కారు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు.
ఈ సినిమా విషయంలో తన తల్లితో పాటు భార్య సుజాత తనకు అండగా నిలిచిందన్నారు. అంతేకాకుండా తన భార్య బ్యాంకులో దాచుకున్న డబ్బులు కూడా ఇస్తానని చెప్పడంతో పాటు.. ఆమె ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, ప్రొడక్షన్ బాయ్ లా కూడా పనిచేసిందని తెలిపాడు. ఈ సినిమాకు గరుడవేగ ఫేం అంజి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.