Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు – మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‍లో ‘గుంటూరు కారం’ సినిమా ప్రస్తుతం రూపొందుతోంది. చాలా ఏళ్ల తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ మూవీపై అంచనాలు హైరేంజ్‍లో ఉన్నాయి. అతడు, ఖలేజా (2010) చిత్రాల తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న చిత్రం ఇదే కావడంతో ఆసక్తి నెలకొని ఉంది. అయితే, ‘గుంటూరు కారం’ సినిమాకు మొదటి నుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.

షూటింగ్ ఆలస్యంగా మొదలవడం, హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకోవడం లాంటివి జరిగాయి. అయితే, తాజాగా ఈ సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. దీంతో షూటింగ్ కూడా నిలిచిపోయిందని సమాచారం. గుంటూరు కారం సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. హఠాత్తుగా ఆయన ఈ మూవీ నుంచి బయటికి వెళ్లారని సమాచారం. దీంతోనే గుంటూరు కారం షూటింగ్ నిలిచిపోయిందట. మరో సినిమాటోగ్రాఫర్ కోసం చిత్ర యూనిట్ అన్వేషిస్తోందని సమాచారం. అయితే, పీఎస్ వినోద్ ను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని టాక్.

ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది. ఇక షూటింగ్ నిలిచిపోవటం వల్లే హీరో మహేశ్ బాబు.. తన కుటుంబంతో కలిసి లండన్‍కు వెకేషన్‍కు వెళ్లాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‍తో అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్లే గుంటూరు కారం మూవీ నుంచి పీఎస్ వినోద్ వైదొలిగినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గతంలో తివిక్రమ్ సూపర్ హిట్ సినిమాలైన అరవింద సమేత, అల వైకుంఠపురంలో మూవీలకు వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా చేశాడు. గుంటూరు కారం కోసం కొత్త కెమెరామెన్‍ను వెతకటంతో పాటు పీఎస్ వినోద్‍ను ఒప్పించి మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నాలను కూడా మేకర్స్ చేస్తున్నారని సమాచారం.

హారికా, హాసినీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గుంటూరు కారం నుంచి హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఇటీవలే తప్పుకుంది. సినిమాలో తన రోల్‍కు ప్రాధాన్యం తగ్గటంతో ఈ మూవీ నుంచి బయటికి వెళ్లింది. ఆ స్థానంలో శ్రీలీల మెయిన్ హీరోయిన్‍గా చేస్తోంది. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్‍గా ఈ సినిమాలో ఛాన్స్ అందుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా తొలుత ఈ సినిమా నుంచి నిష్క్రమించినా.. చిత్రయూనిట్ అతడితో మాట్లాడి తిరిగి తీసుకొచ్చిందని సమాచారం.