Cinema Updates : ఈ ఏడాది ‘కల్కి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టే సినిమాలు రాలేదు. మధ్యలో ఒకటి రెండు చిన్న సినిమాలు వచ్చాయి కానీ, అవి ఏమాత్రం కూడా బాక్స్ ఆఫీస్ మీద ప్రభావం చూపలేకపోయాయి. ఇప్పుడు ట్రేడ్ మొత్తం ఆగస్టు 15 వ తేదీన విడుదలయ్యే సినిమాల మీదనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ ఒక్క రోజే ఏకంగా నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్ మరియు తంగలాన్ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బుక్ మై షో యాప్ లో మొదలయ్యాయి. అయితే ప్రతీ సినిమాకి విడుదలకు ముందే ఇన్సైడ్ రిపోర్ట్స్ తెలుస్తుంటాయి.
అలా విడుదల అవ్వబోతున్న ఈ నాలుగు సినిమాలలో ఏ సినిమాకి పాజిటివ్ బజ్ ఉంది?, ఏ సినిమా పై చెయ్యి సాధించబోతుంది అనేది ఈ స్టోరీ లో చూద్దాం. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పూరీ జగన్నాథ్, లైగర్ చిత్రం తో భారీ ఫ్లాప్ ని అందుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఫామ్ లోకి వచ్చేందుకు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ మీదనే నమ్మకం పెట్టుకున్నాడు. ఆగస్టు 15 న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు A సర్టిఫికేట్ ఇచ్చారు. పూరి మార్క్ లో ఈ చిత్రాన్ని బాగానే తీసాడు అనే టాక్ ఉంది కానీ, ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా మిగిలే అవకాశాలుx ఉన్నాయట. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంపై మార్కెట్ లో క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు.
ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ పాట ఒకదానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. అలాగే విడుదలైన టీజర్స్, ట్రైలర్ కూడా ఈ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసాయి. వీటితో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే అందచందాలను సిల్వర్ స్క్రీన్ మీద తనివితీరా చూసేందుకు యూత్ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా సెన్సార్ రిపోర్ట్ కూడా ఈ చిత్రానికి చాలా పాజిటివ్ గా ఉంది. ఇకపోతే గీత ఆర్ట్స్ కాంపౌండ్ నుండి వస్తున్న ‘ఆయ్’ చిత్రానికి కూడా రిపోర్ట్స్ బాగున్నాయి. కానీ తమిళ హీరో విక్రమ్ నటించిన ‘తంగలాన్‘ చిత్రానికి మాత్రం అనుకున్న స్థాయిలో పాజిటివ్ రిపోర్ట్స్ లేవు. కాబట్టి ఈ ఆగస్టు 15 న విడుదల అవ్వబోతున్న సినిమాలలో మిస్టర్ బచ్చన్ చిత్రమిదే పై చెయ్యి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.