Allu Arjun : అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబో సెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మెసేజ్‌కు స్టైలిష్ యాక్షన్ మాస్ అంశాలను మేళవించి సినిమాలు తెరకెక్కించడం డైరెక్టర్ అట్లీ స్పెషాలిటీ. తేరీ నుంచి జవాన్ వరకు ఈ ఫార్ములాలో అట్లీ రూపొందించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను రాబట్టాయి. జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అట్లీ.
షారుఖ్‌ఖాన్ హీరోగా గత ఏడాది విడుదలైన జవాన్ మూవీ 1100 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. బాలీవుడ్ హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. జవాన్ బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్‌తో అట్లీ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అట్లీ మార్క్ స్టైలిష్ యాక్షన్ అంశాలతో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం. ఈ పాన్ ఇండియన్ మూవీ కోసం అట్లీ 60 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలిసింది. జవాన్ బ్లాక్‌బస్టర్ తర్వాత అట్లీకి డిమాండ్ పెరగడంతో అతడు కోరినంత మొత్తాన్ని ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ మూవీతో కోలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ను అందుకోనున్నట్లు డైరెక్టర్ల లిస్ట్‌లో అట్లీ చేరనున్నాడు. రెమ్యునరేషన్ల విషయంలో కోలీవుడ్‌లో శంకర్ టాప్‌లో ఉన్నాడు. శంకర్ ఒక్కో సినిమాకు 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను స్వీకరించనున్నట్లు సమాచారం. తన గురువు శంకర్ రికార్డును అల్లు అర్జున్ మూవీతో అట్లీ తిరగరాయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.