Anasuya : అనసూయ కీలక పాత్ర చేసిన ‘రజాకర్’ చిత్రం పూర్తిగా పొలిటికల్ జోనర్ సినిమాలాగా తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ నుండి ‘భారతీ భారతీ ఉయ్యాలో’ పాట లాంచ్ కోసం మూవీ టీమ్ ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఆ ప్రెస్ మీట్‌లో అనసూయ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురయ్యింది. అలాగే ఈ సినిమాలో ఉన్న బోల్డ్ సన్నివేశాల గురించి కూడా పబ్లిక్ గా కొందరు అడిగారు.
‘రజాకర్’ చిత్రం అప్పటి రజాకర్లపై ఆధారపడి తెరకెక్కింది కాబట్టి.. ఒకప్పుడు వారు మహిళలను నగ్నంగా నిలబెట్టి బతుకమ్మ ఆడిన సన్నివేశాలు సినిమాలో ఉంటాయా అని అనసూయను ప్రశ్నించారు. అయితే అలాంటివి తెలుసుకోవాంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే అని సస్పెన్స్‌లో పెట్టింది అనసూయ. సినిమా కథ విన్న తర్వాత రాజకీయాల్లోకి రావాలని అనిపించలేదా మీకు అని ప్రశ్నించగా..
‘‘లేదు. బయట ఉండి కూడా చాలా ఉద్దరించవచ్చు. నేను ఏ ఇంటికి, ఏ రాజకీయానికి చెందినదాన్ని కాదు అని నమ్ముతాను. రాజకీయాల్లోకి రాకపోయినా.. నేను చేయాల్సిన నీటిబొట్టు చేస్తూ వస్తున్నాను. అది చాలామందికి తెలుసు. రాజకీయాల్లో ఉన్నవారు కూడా మనల్ని చూసుకుందామని వచ్చిన మనుషులే. అందుకే వారి పని వాళ్లని చేయనిద్దాం. నా వంతు నేను చేస్తాను.’’ అంటూ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది అనసూయ. ఒకవేళ నిర్మాత నారాయణ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానిస్తే వెళ్తారా అని అడగగా.. ‘‘నేను అలా అనుకోను. అసలు ఈ టాపిక్ మా మధ్య ఎప్పుడూ రాలేదు. రాజకీయం అనేది నా వల్ల కాదు’’ అంటూ రాజకీయాల్లో ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చింది.