Nagarjuna : ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ ఎడిటర్‌గా పేరు తెచ్చుకున్నారు మార్తాండ్ కే వెంకటేశ్. సీనియర్ హీరోలు సైతం తమ సినిమాలకు ఆయనే ఎడిటర్‌గా పనిచేయాలని ఎదురుచూసే సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి మార్తాండ్.. ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి ముక్కుసూటిగా కొన్ని నిజాలు చెప్పారు.

ఇండస్ట్రీలో పలకరింపులు అనేవి ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయి, నాగార్జున, నాగచైతన్యలతో ఆయన బంధం ఎలా ఉంటుంది అనేదాని గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. 1999 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి పనిచేస్తున్నా నాగార్జున ఎప్పుడూ పలకరించలేదని అన్నారు మార్తాండ్. రోజూ పలకరించడం లాంటిది ఏమీ ఉండదని, పైగా తాను కూడా నాగార్జునను పట్టించుకోకుండానే వెళ్లి తన పని తాను చేసుకుంటానని అన్నారు. నాగార్జున మాత్రమే కాదు.. నాగచైతన్యతో కూడా తన బంధం ఇలాగే ఉంటుందన్నారు.

ఒకవేళ నాగార్జున తనతో ఏమైనా మాట్లాడాలనుకుంటే పర్సనల్‌గానే మాట్లాడతారని, పిలుస్తారని, ఆ తర్వాత ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తారని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో అవమానాలు అనేవి చాలా చూశానని, ఇప్పుడు తనకు అన్నీ అలవాటు అయిపోయాయని అన్నారు మార్తాండ్ కే వెంకటేశ్. అంతే కాకుండా ఒక డైరెక్టర్‌కు లేదా హీరోకు సంబంధించిన కుటుంబ సభ్యులు చనిపోతే చూడడానికి చాలామంది వెళుతున్నారని, కానీ ఒక పాత నటుడు చనిపోతే మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.