Allu Arjun : అల్లు అర్జున్ .. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనకున్న క్రేజ్ మాటల్లో వర్ణించలేనిది. బాలనటుడిగా కెరీర్‌ను ఆరంభించిన ఆయన ‘గంగోత్రి’తో హీరోగా తెరంగేట్రం చేశారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఎదురైన ప్రతి సవాల్‌ను, విమర్శను స్వీకరించి నటుడిగా తనని తాను మలుచుకున్నారు. ‘పుష్ప ది రైజ్’తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఇక, తాజాగా ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. జాతీయ చలన చిత్ర అవార్డుల చరిత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు.
అసలు బన్నీ హీరో ఎలా అయ్యారంటే.. చిరంజీవి ప్రతీ పుట్టినరోజుకు అభిమానులు సమక్షంలో సంబరాలు జరుగుతాయనే విషయం తెలిసిందే. ప్రతి ఏడాది మాదిరిగానే ఒకసారి చిరంజీవి పుట్టినరోజు వేడుకలో చాలామంది డ్యాన్సులు చేశారు. అందులో బన్నీ కూడా స్టెప్పులేశారు. అలా ఆయన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కంట్లో పడ్డారు. రాఘవేంద్రరావు వెంటనే నిర్మల (అల్లు అర్జున్ తల్లి) దగ్గరకు వెళ్లి.. వంద రూపాయలు ఇచ్చి.. ‘మీవాడు పెద్దయ్యాక.. నేనే హీరోను చేస్తా’ అని చెప్పారు. ఆ తర్వాత నిజంగానే ‘గంగోత్రి’ ద్వారా బన్నీ హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. రాఘవేంద్రరావు ఇచ్చిన ఆ వంద రూపాయల నోటు ఇప్పటికీ అల్లు అర్జున్ దగ్గర ఉండటం విశేషం.
ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారో తెలుసా.. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడిగా.. అల్లు అరవింద్ తనయుడిగా.. అగ్ర కథానాయకుడు చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అల్లు అర్జున్ . 1985లో విడుదలైన ‘విజేత’, 1986లో వచ్చిన ‘స్వాతిముత్యం’ చిత్రాలతో ఆయన బాలనటుడిగా పరిచయమయ్యారు. 2003లో విడుదలైన ‘గంగోత్రి’ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకున్నా.. బన్నీ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన లుక్స్‌ను హేళన చేస్తూ పలువురు తీవ్రంగా కామెంట్స్ చేశారు. ఆ విమర్శలకు బన్నీ ‘ఆర్య’తో దీటుగా సమాధానం చెప్పారు. హేళన చేసిన వారితోనే ‘ఫీల్ మై లవ్’ అనిపించారు. ఈ సినిమా తర్వాత ఆయన్ని అభిమానించే వారి సంఖ్య ఇతర రాష్ట్రాలకు పాకింది. ‘కన్నవాళ్ల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదే’ అని చెబుతూ అభిమానులనూ తన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తారాయన. ‘ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులే’ అంటూ ఆయన మురిసిపోతుంటారు.