Allu Arjun : ఉత్తమ నటుడిగా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకోవడంపై బన్నీ సంతోషం వ్యక్తం చేసారు. దేవిశ్రీతో కలిసి అవార్డు తీసుకోవడం తనకు ఎంతో స్పెషల్ అని అన్నారు. జాతీయ అవార్డు గ్రహీతలను మైత్రీ ప్రొడ్యూసర్స్ సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో పాటుగా పలువురు సినీ సెలబ్రిటీలు, దర్శక నిర్మాతలు హాజరయ్యారు. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ”నేను మాట్లాడాలని అనుకోలేదు. కానీ దేవీని చూసిన తర్వాత మాట్లాడాలని అనిపించింది. అందరితో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి అవార్డు తీసుకోవడం నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే ‘ఆర్య’ సినిమా అప్పటి నుంచి హిందీ ఇండస్ట్రీలోకి వెళ్లమని దేవిశ్రీకి చెప్తూ వచ్చాను. హీరోగా నేను హిందీ సినిమాల్లోకి వెళ్లడం కష్టం. అదే హీరోయిన్లు, టెక్నిషియన్లు వెళ్లడం ఈజీ. అప్పటికి బాలీవుడ్ అనేది మనకు చాలా దూరం. నేను అది ఎప్పుడు అచీవ్ చేస్తానో లేదో నాకు తెలియదు.. నువ్వు వెళ్లి ఒక హిందీ సినిమా చేయమని దేవికి చెప్పేవాడిని. గత 20 ఏళ్లలో ఎన్నోసార్లు చెప్పాను. అలా చెప్పిన ప్రతీసారి ఎప్పటికప్పుడు ‘ముందు నువ్వు వెళ్లు అబ్బా.. నీతో పాటు నేనూ వచ్చేస్తా’ అనేవాడు.
అది మనకెక్కడ సాధ్యమవుతుందిలే అనుకునేవాడిని. అలాంటిది అనుకోకుండా ‘పుష్ప’ సినిమా హిందీలో అంత బాగా వర్క్ అవుట్ అవడం, మేమిద్దరం ఒకేసారి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం. 20 ఏళ్ల నుంచి దేవి అన్న మాటను నేను ఒక్కసారి కూడా సీరియస్ గా తీసుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఆ మాట నిజమైనందుకు, తనతో కలిసి నేషనల్ అవార్డు తీసుకోవడం అనే ఫీలింగ్ ని నేను మాటల్లో చెప్పలేను. దేవికి అవార్డు వచ్చినందుకు అభినందనలు. జాతీయ అవార్డులకు మా ఇద్దరి పేర్లు ప్రకటించినప్పుడు మా నాన్న ఎంతో సంతోషించారు. నా ఇద్దరు కొడుకులకు నేషనల్ అవార్డ్స్ వచ్చినట్టు అనిపిస్తుందని ఆయన అన్నారు. దేవి తండ్రి సత్యమూర్తి గారు లేకపోవచ్చు.. కానీ దేవి అవార్డు తీసుకోవడం నేను చూడాలి. అందుకే ఢిల్లీ వస్తానన్నారు. ఆయన నాకు అవార్డు వచ్చినందుకు ఎంత ఆనందించాడో, దేవికి వచ్చినందుకు కూడా అంతే ఆనందించారు. ‘చెన్నైలో చదువుకుంటున్నప్పుడు ప్రిన్సిపల్ దగ్గర మినిమమ్ సెర్టిఫికెట్ తీసుకోని మేము.. ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గర మెడల్స్ తీసుకుంటామని అనుకున్నావా?’ అని ఆయన్ని అడిగా” అని నవ్వుతూ చెప్పారు బన్నీ.