మీకు హీరోయిన్ భాను శ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) గుర్తు ఉన్నారా? పేరు చెబితే ఎవరికీ ఐడియా ఉండకపోవచ్చు. పేరు చెప్పకుండా ‘వరుడు’ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సరసన నటించిన అమ్మాయి అని చెబితే ఎక్కువ మంది గుర్తు పట్టవచ్చు. తొలి సినిమా తర్వాత ఆమెకు తెలుగులో మరో అవకాశం రావడానికి రెండేళ్లు టైమ్ పట్టింది. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. మెయిన్ హీరోయిన్ రోల్స్ ఆమెకు ముఖం చాటేశాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమె వార్తల్లోకి వచ్చారు.
ట్విట్టర్ వేదికగా సంచలనానికి భాను శ్రీ మెహ్రా తెర తీశారు. అల్లు అర్జున్ తనను బ్లాక్ చేశారంటూ ఆమె ట్వీట్ చేశారు. తాను అల్లు అర్జున్ ‘వరుడు’లో యాక్ట్ చేశానని, ఆ తర్వాత ఇప్పటి వరకు తనకు పని లేదని ఆమె పేర్కొన్నారు. కష్టాల్లో సంతోషాన్ని వెతుకుతూ ఉంటానని, తన యూట్యూబ్ ఛానల్ సబ్స్కైబ్ చేసుకోమని భాను శ్రీ మెహ్రా కోరారు. వరుడు సినిమా తర్వాత ఖాళీ ఉన్న ఈ హీరోయిన్ యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టింది. ప్రతి వీడియోకు అల్లు అర్జున్ ను ట్యాగ్ చేస్తుండడంతో చిరాకొచ్చిన బన్నీ ఆమెను బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్లో పెట్టి వాపోయింది.
ఈ విషయంపై ఆయన ఫ్యాన్స్ భానుని తిట్టిపోస్తున్నారు. ట్విట్టర్ ఉందని ప్రతి వీడియో ట్యాగ్ చేస్తూ ఉంటే బ్లాక్ చేయడా? అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భాను శ్రీ మెహ్రా తీరును ఎండగట్టడం స్టార్ట్ చేశారు. కొంత మంది అయితే సోషల్ మీడియా వేదికగా ఆమెపై ఎటాక్ చేశారు. ఆమె కూడా ఏమీ ఊరుకోలేదు. తనను కిందకు లాగాలని ఎవరు ప్రయత్నించినా తగ్గనని బదులు ఇచ్చారు. నీకేం పని పాట లేదా.. అసలు నీకు బ్రెయిన్ ఉందా నీకు పని లేకపోతే మా హీరోకి మాత్రం చాలా పని ఉంది ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు. నువ్విలా వీడియోలు చూడమంటూ తరచూ తనని ట్యాగ్ చేస్తూ ఉండగా తనకు నోటిఫికేషన్ వస్తుంటాయి.