Alia Bhatt : 69వ జాతీయ చలన అవార్డులను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి ఉత్తమ నటీమణులుగా ఆలియా భట్, కృతి సనన్ సంయుక్తంగా ఈ అవార్డు అందుకోనున్నారు. మిమి చిత్రంలో నటనకు కృతి సనన్.. గంగుభాయ్ కతయావాడి సినిమాలో నటనకు ఆలియా భట్ ఇద్దరు సంయుక్తంగా 69వ జాతీయ చలన చిత్ర అవార్డు వరించింది. త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలోఅవార్డు రావాలంటే ఎంతో కష్టమైన పనులు చేయాల్సి ఉంటుందని అర్థమవుతోంది. దానికి నిదర్శనం వీళ్లిద్దరూ నటించిన పాత్రలు చూస్తే తెలుస్తుంది.
‘గంగూబాయి కాఠియావాడి’చిత్రంలోని నటనకుగానూ అలియా భట్ జాతీయ అవార్డుకు ఎంపికైంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.210 కోట్లు వసూళ్లు చేసింది. వేశ్య పాత్రలో అలియా నట విశ్వరూపం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అప్పుడే ఆమెకు జాతీయ అవార్డు ఖాయమని చాలామంది భావించారు. అది ఇప్పుడు నిజమైంది. ముంబయి మాఫీయా క్వీన్‌గా పేరొందిన గంగూబాయి జీవితాధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాత్రతో అలియా మూడేళ్లు ప్రయాణం చేసింది. ఆ క్యారెక్టర్‌ను ఎంతగా ఆకళింపు చేసుకుందంటే.. కొన్ని సార్లు తనకు తెలియకుండానే గుంగూబాయిలా కూర్చోవడం, ఆమెలా మాట్లాడడం చేసేదట. వేశ్య పాత్రకావడంతో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ ఈ చిత్రాన్ని తిరస్కరించారనేది బాలీవుడ్ టాక్. వాళ్లు నో చెప్పడంతో అలియా ఆ అవకాశాన్ని అందుకుంది. విమర్శకులకు తన సత్తా ఏంటో తెలియజేసింది. ప్రముఖ దర్శక, నిర్మాత మహేశ్ భట్ కుమార్తె కాబట్టి అవకాశాలొస్తున్నాయనే మాటలు ఆమె కెరీర్ ప్రారంభంలో వినిపించేవి.
ఏదైనా సినిమాలో గర్భిణిగా కనిపించాలంటే చాలామంది హీరోయిన్లు అంగీకరించరు. ‘మిమి’ కోసం ఆ సాహసం చేసి ప్రేక్షకుల మన్ననలు అందుకోవడంతోపాటు ఇప్పుడు జాతీయ ఉత్తమ నటిగా నిలిచారు కృతిసనన్. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె సరోగేట్ మదర్‌గా నటించారు. సన్నజాబిలా నాజూగ్గా ఉండే కృతి ఆ పాత్ర కోసం దాదాపు 15 కిలోలు బరువు పెరిగింది. అదే సమయంలో వేరే చిత్రాల్లో నటించాల్సి రావడంతో బరువు తగ్గారు. ‘‘మిమి’ కోసం బరువు పెరగడం చిన్న విషయం కాదు. అలాగని తిరిగి ఆ బరువు తగ్గించుకోవడం ఓ సవాల్. మూడు నెలలు పాటు ఎలాంటి వ్యాయామం, యోగా లేదు’’ అని కృతి ఓ సందర్భంలో చెప్పడం ఆమె కష్టాన్ని తెలియజేస్తుంది.