సినీ పరిశ్రమలో హిట్, ఫ్లాప్‌లు సహజం. ఓ సినిమాను కోట్ల కొద్ది డబ్బు పెట్టి భారీ అంచనాల మధ్య తెరకెక్కించినా, టాలెంటెడ్ యాక్టర్స్‌తో సీన్లు చేయించినా ఒక్కోసారి అవి నిరాశను మిగులుస్తాయి. కనీసం పెట్టుబడి డబ్బు కూడా రాక నిర్మాతలు సర్వం కోల్పోయి దారుణమైన స్థితికి చేరిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయిన అనుకోకుండా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఇవన్నీ ప్రేక్షకులపై ఆధారపడి ఉంటాయి. అయితే సినిమా హిట్ అయినపుడు మాత్రం దాని క్రెడిట్స్ కొట్టేయడానికి బృందంలోని వారంతా ప్రయత్నిస్తుంటారు. అదే ఫ్లాప్ అయితే మాత్రం ‘ముందే చెప్పాము డైరెక్టర్ వినలేదు’ అంటూ తప్పంతా డైరెక్టర్‌దే అన్నట్లుగా సృష్టిస్తారు. నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా విషయంలో అదే జరిగింది.
‘భాయ్’ సినిమా డైరెక్టర్ వీరభద్రం చౌదరి. ఆయన అప్పటికే అల్లరి నరేష్‌తో అహ నా పెళ్ళంట అనే సినిమా తీసి సక్సెస్ సాధించాడు. అలాగే సునీల్‌తో పూలరంగడు అనే సినిమాతో వరుసగా రెండు హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా జోరు మీదున్న వీరభద్రం నాగార్జునను హీరోగా పెట్టి భాయ్ సినిమాను తెరకెక్కించాడు.
ఈ సినిమాని కూడా యాక్షన్ కామెడీగా రూపొందించాడు, ఈ సినిమాలో రీచా గంగోపాధ్యాయ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అయితే భారీ అంచనాల మధ్య 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరమైన డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో దర్శకుడు వీరభద్రం చౌదరికి పెద్ద దెబ్బ పడింది. అయితే నాగార్జున కూడా తాను బాగానే చేశానని, తన మిస్టేక్ ఏం లేదనట్టుగా అప్పట్లో చెప్పడంతో ఈ సినిమా ఫ్లాప్‌కి కారణంగా దర్శకుడే అనే సందేశం వెళ్లిపోయింది.
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వీరభద్రం చౌదరి హీరో నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “భాయ్ సినిమాతో నా కెరీర్ ఆగిపోయింది. అప్పటి వరకు హాయిగా సాగిపోతున్న జీవితంలో భాయ్ పెద్ద బ్రేక్ వేసిందని, ఫ్లైట్‌లో వెళ్తున్న వాళ్లని మధ్యలో ఒక్కసారిగా తోసేస్తే ఎలా అయితే ఉంటుందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది” అని తెలిపారు. అయితే మెుదట తన సినిమాను కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాసుకొన్నానని, నాగార్జునని హీరోగా తీసుకున్నాక ఆయనకి తగ్గ కథ మార్చార్సి వచ్చిందని అన్నారు. అలా తన కథ మెుత్తం సీరియస్‌గా వెళ్లిందని చెప్పుకొచ్చారు. దాని వల్లే ప్రేక్షకులకు సినిమా నచ్చలేదని చెప్పారు. ఇక నాగార్జున ఈ సినిమాపై తన తప్పేంలేదంటూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేయటంపై కొంత అసహనం వ్యక్తం చేశారు. మెుత్తానికి నాగార్జున వల్లే తన కెరీర్ నాశనం అయిందంటూ చెప్పకనే చెప్పేశారు వీరభద్రం.