Actress Archana : అందం, యాక్టింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అదృష్టం కలిసిరాక కొంతమంది హీరోయిన్ల కెరీర్లు మధ్యలోనే ముగిసిపోయాయి. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు వేద. ఆ తర్వాత ఈమె తన పేరుని అర్చన గా మార్చుకుంది. ‘తపన’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన అర్చన, ఆ తర్వాత అల్లరి నరేష్ హీరో గా నటించిన ‘నేను’ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.
కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద హిట్టేమీ కాదు కానీ, నటిగా మాత్రం అర్చన కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ఆమెకి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ, ఎందుకో అనుకున్నంత రేంజ్ కి మాత్రం వెళ్లలేకపోయింది. 2022 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన అర్చన ఇండియా కాలం లో కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఆమె అభిమానులకు దగ్గరగానే ఉంది.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈమె ఎందుకు తాను అనుకున్న స్థాయికి ఇండస్ట్రీ లో ఎదగలేకపోయిందో చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న సమయం లో ఈమెకి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం లో త్రిష కి స్నేహితురాలిగా సపోర్టింగ్ క్యారక్టర్ చేసే అవకాశం దక్కింది. ఆ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
ఇందులో సపోర్టింగ్ రోల్ చేసిన అర్చన కి కూడా మంచి పేరొచ్చింది. ఉత్తమ సహాయనటిగా ఫిలిం ఫేర్ అవార్డ్స్ కి కూడా ఆమె నామినేట్ అయ్యింది. ఆ పాత్ర అంత హిట్ అవ్వడం వల్లే అర్చన కెరీర్ కి శాపం లాగ మారిందట. ఈ క్యారక్టర్ ని చూసి అందరూ ఆమెకి హీరోయిన్ రోల్స్ బదులు ఇలాంటి క్యారెక్టర్స్ ఇస్తూ వచ్చారట, త్రిష తో చేసిన ఆ పాత్ర వల్లే తన కెరీర్ ఇలా అయ్యిందంటూ చెప్పుకొచ్చింది అర్చన.