Actor Siddharth : తమిళ నటుడు సిద్ధార్థ్ తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటాడు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెటిజన్లు కూడా ఆయన వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2024)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలిచిన తర్వాత సిద్ధార్థ్ ఇటీవల చేసిన ట్వీట్ కూడా సంచలనం రేపింది. RCB విజయం తర్వాత, బెంగళూరు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి వీధుల్లోకి వచ్చారు. 16 ఏళ్లుగా ఐపీఎల్ గెలవకపోయినా.. రెండో సీజన్ లోనే డబ్ల్యూపీఎల్ గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అదే వీడియోను షేర్ చేసిన సిద్ధార్థ్, వారిలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేరని ప్రశ్నించారు. దేశంలోని పితృస్వామ్య వ్యవస్థే ఇందుకు కారణమని పెద్ద ఆరోపణ కూడా చేశాడు. “ఒక మహిళా జట్టు టోర్నమెంట్‌ను గెలుచుకుంది, కానీ సంబరాలు చేసుకోవడానికి ఒక్క మహిళ కూడా వీధుల్లో లేరు. ఇది భారతదేశంలోని పితృస్వామ్యానికి నిదర్శనం” అని సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. నెటిజన్లకు ఇది అర్థంకాక.. అసలు నీ ఉద్దేశం ఏంటి.. ఆడవాళ్ల విజయాన్ని మగవాళ్లు సెలబ్రేట్ చేసుకోకూడదా? అని విమర్శిస్తూ కామెంట్లు చేస్తు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో సిద్ధార్థ్ తన గత ట్వీట్ పై క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేశాడు. సిద్ధార్థ్ ఇలా వివరించాడు, “పై ట్వీట్‌ను నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. భారతదేశంలో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా రాత్రిపూట స్వేచ్ఛగా తిరగలేరు. ఓ మహిళల జట్టు గెలిచిన సందర్భంలోనూ పురుషుల్లాగే మహిళలు కూడా వీధుల్లో సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారన్నదే చెప్పాలనుకున్నాను” అని సిద్ధార్థ్ వివరించాడు.
ఆ తర్వాత కూడా చాలా మంది అభిమానులు సిద్ధార్థ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మీరు నిజంగా ఏమి చెప్పాలనుకుంటున్నారో ఇక్కడ ఎవరికీ అర్థం కాలేదు అని ఓ అభిమాని చెప్పడంతో సిద్ధార్థ్ ఎస్‌ఎంహెచ్ (తల ఊపుతూ) అనే అక్షరాలను పోస్ట్ చేశాడు. సిద్ధార్థ్ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్నాడు. గతేడాది చిన్నా సినిమాలో నటించాడు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ కథ పిల్లల లైంగిక వేధింపుల చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2లో కనిపించనున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.