Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఎంత జోష్ మీద ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జనసేన పార్టీ ద్వారా నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో సీట్లు కొల్లగొట్టి, ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణమై, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగైదు ముఖ్యమైన శాఖలకు మంత్రి కూడా అయ్యాడు. ఇది ఆయన అభిమానులకు ఏ స్థాయి సంతృప్తిని ఇచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తాడా లేదా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో నెలకొంది. ఇప్పటికే ఆయన ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ , ‘ఓజీ’ వంటి చిత్రాలకు కమిట్ అయ్యి ఉన్నాడు.

ఈ మూడు సినిమాల షూటింగ్స్ 50 శాతం కి పైగానే అయిపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రోజురోజుకి బాగా బిజీ అయిపోతున్నాడు, ఇలాంటి సమయం లో షూటింగ్స్ చేస్తాడా లేదా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. అయితే ఆ అనుమానాలకు సమాధానం చెప్తూ ‘హరి హర వీరమల్లు’ మూవీ నిర్మాత ఏ ఏం రత్నం మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నారని, ఆయనకీ సంబంధించి కేవలం 25 రోజుల కాల్ షీట్స్ మాత్రమే అవసరమని, ఆయనకీ కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు చూసుకొని షూటింగ్స్ పెట్టుకుంటామని, అది కూడా ఆంధ్ర లోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఇదే ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ సినిమాలో వచ్చే ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటాయని, ఇప్పటి వరకు ఏ హీరో కూడా చేయనటువంటి వీరోచిత పోరాటాలు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చేసాడని, ముఖ్యంగా పులి తో ఆయన పోరాడే సన్నివేశం సినిమాకే పెద్ద హైలైట్ అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఇటలీ లో జరుపుతున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.