Hari Shanker : రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా మీద అతి నమ్మకంతో హరీష్ శంకర్ ఒక రోజు ముందే సాయంత్రం నాడు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రీమియర్ షోస్ వేయించాడు. ఈ షోస్ నుండి వచ్చిన ప్లాప్ టాక్ సినిమా ఓపెనింగ్స్ పై బలమైన ప్రభావం చూపించింది. ఇదంతా పక్కన పెడితే రవితేజ కొత్త హీరోయిన్ ‘భాగ్యశ్రీ భొర్సే’ తో చేసిన రొమాన్స్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా సితార్ సాంగ్ లో రవితేజ హీరోయిన్ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వెయ్యడం పై పెదవి విరుస్తున్నారు. కూతురు వయస్సు లో అమ్మాయితో ఇలాంటివి చెయ్యడానికి మనసు ఎలా వచ్చింది అంటూ రవితేజ ఫ్యాన్స్ సైతం ఆయన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ చేస్తూ నిన్న హరీష్ శంకర్ తన టీం తో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి సితార్ పాటలోని ఆ అసభ్యకరమైన స్టెప్పు గురించి అడిగారు. దానికి హరీష్ శంకర్ సమాధానం చెప్తూ ‘వాస్తవానికి ఆ పాటని షూట్ చేసేటప్పుడు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి అదే తొలిరోజు షూటింగ్. ఆయన ఆ స్టెప్పు పెట్టినప్పుడు నాకు కూడా చాలా అభ్యంతకరంగా అనిపించింది. కానీ మొదటి రోజే కొరియోగ్రాఫర్ కి అలా చెప్తే నిరుత్సాహపడుతాడని నేను చెప్పకుండా వదిలేసాను. ఈ పాటని మాములుగా చూస్తే ఇబ్బందిగా అనిపించదు. అలా కాకుండా స్క్రీన్ షాట్స్ తీసి,భూతద్దం లో చూస్తే కచ్చితంగా ఇబ్బందిగానే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇదంతా పక్కన పెడితే ఒక్క పెద్ద హీరోగా ఇలాంటి ఇబ్బందికరమైన స్టెప్పులు పెడుతున్నప్పుడు, అలాంటివి వద్దు ఆపండి అని చెప్పడం రవితేజ బాధ్యత. కానీ ఆయన డైరెక్టర్ ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మి అనుసరించేట్టు ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రవితేజ సినిమాలను చూసిన కళ్ళతో ఇప్పుడు చేస్తున్న సినిమాలను చూస్తుంటే కడుపు మండుతుందని, రవితేజ ఇక నుండి అయినా జాగ్రత్తలు తీసుకోకుంటే సినిమాలు ఆపేయడం మంచిది అంటూ ఫ్యాన్స్ తిడుతున్నారు.