Clapboard : యాక్షన్, కట్ పదాలతో పాటు సినిమా షూటింగ్ లో వినిపించేది క్లాప్ సౌండ్. సినిమాలోని సీన్ మొదలు పెట్టేముందు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి క్లాప్ బోర్డ్ పట్టుకొని క్లాప్ కొట్టడం మనం చూస్తూ ఉంటాం. అసలు క్లాప్ ఎందుకు కొడతారో తెలుసా? క్లాప్ కొట్టడం వల్ల సినిమా బృందంకి ఉండే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్లాప్ బోర్డ్‌ని క్లాపర్ బోర్డ్ అని కూడా అంటారు. ఈ క్లాపర్ బోర్డు ఎప్పటినుంచో ఉంది. సాధారణంగా అప్పట్లో సినిమాలు తీసేటప్పుడు వాడే కెమెరా సౌండ్ రికార్డ్ చేసేది కాదు. షూట్ చేయడానికి కెమెరా, సౌండ్ రికార్డ్ చేయడానికి ఇంకొక డివైస్ వాడేవారు. ఇప్పటికి కూడా దాదాపు చాలా చోట్ల ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. అలాంటప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో సీన్‌కి తగ్గట్టుగా సౌండ్ సింక్ చేయడానికి ఎడిటర్స్ క్లాప్ టైమింగ్ ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది.
ఇక సినిమా షూటింగ్ సినిమాలో సీన్స్ ఆర్డర్లో తీయరు కాబట్టి ఏ సీన్ ఎక్కడ రావాలో ఎడిటర్‌కి సులభంగా అర్ధం కావడానికి ఈ క్లాప్ బోర్డు ఉపయోగపడుతుంది. ఈ క్లాప్ బోర్డ్ మీద ప్రొడక్షన్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ పేర్లతో పాటు స్క్రిప్ట్‌లో ఆ పర్టిక్యులర్ సీన్ నెంబర్, టేక్ నెంబర్ కూడా ఉంటుంది. దాని ఆధారంగా ఎడిటర్స్ సినిమాను ఎడిట్ చేస్తారు. క్లాప్ బోర్డ్ పై ఉన్న వివరాలను అనుసరించి మంచి సీన్లను ఎడిటర్ ఎంచుకొని సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తారు. వీటితో పాటు ఆ క్లాప్ బోర్డ్ కొట్టినప్పుడు వచ్చే సౌండ్ ఆధారంగా కంటి విజువల్‌కి కరెక్టుగా వాయిస్ ఎక్కడ సింక్ చేయాలన్న విషయంపై కూడా స్పష్టత వస్తుంది.
క్లాప్ వాడడానికి ఇంకొక కారణం సెట్లో చాలా మంది ఉంటారు. క్లాప్ కొట్టిన వెంటనే అందరూ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అర్థం చేసుకుని సైలెంట్ అయిపోతారు. షూటింగ్ సమయంలో వాడే ఇంకొకటి ఎండ్ బోర్డ్. అంటే ఆ రోజు షెడ్యూల్లో సీన్స్ షూటింగ్ అయిపోయింది అనే దానికి సంకేతంగా క్లాప్ బోర్డ్‌ని తిప్పి పట్టుకుంటారు.