Puri Jagananadh : రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఫామిలీ డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్, పరశురాం కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి ఫ్యామిలీ స్టార్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
సినిమా విడుదల తేది దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. ప్రచారంలో బీజీగా ఉన్న విజయ్.. తాజాగా లైగర్ ఫెయిల్యూర్‌పై స్పందించారు. సినిమా విడుదలకు ముందే దాని ఫలితం గురించి అస్సలు మాట్లాడకూడదని తాను నిర్ణయించుకొన్నానని విజయ్ దేవరకొండ తెలిపారు. ‘లైగర్ సినిమాకు ముందు, తర్వాత నా వైఖరిలో ఏ మార్పు లేదు. అయితే ఓ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడుతున్నా. సినిమా విడుదలకు ముందే.. దాని ఫలితం గురించి అస్సలు మాట్లాడకూడదని నిర్ణయించుకొన్నా.
లైగర్ తర్వాతి నుంచి ఇదే అమలు చేస్తున్నా. ఇది నాకు నేనే విధించుకున్న ఓ శిక్ష’ అని విజయ్ చెప్పుకొచ్చారు. మనం బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాం అని విజయ్ దేవరకొండ లైగర్ సినిమా విడుదలకు ముందే అన్నారు. మూవీ ప్రమోషన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన లైగర్.. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అప్పట్లో విజయ్ దేవరకొండ మాటలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పందించారు.