Varun Tej : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల పర్వం మొదలైంది. రాజకీయ పార్టీలు ఎవరు వ్యూహాలతో వారు ఎన్నికల రణరంగం లోకి దూకుతున్నారు. సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకొని, ఎన్నికలను ఎదురుకోబోతుంది. సర్వేలు కూడా ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నట్టు చెప్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అనకాపల్లి నుండి ఎంపీ గా పోటీ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుండే ఆయన అనకాపల్లి నియోజకవర్గం లో ప్రతీ గడప తిరుగుతూ, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ జనాలకు దగ్గర అవుతున్నాడు. అయితే ఆయన కుమార్తె నిహారిక కొణిదెల తిరుపతి అసెంబ్లీ స్థానం నుండి జనసేన పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టు గత రెండు రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని ఆమె సోదరుడు వరుణ్ తేజ్ నేడు రాజమండ్రి లో క్లారిటీ ఇచ్చాడు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1 వ తేదీన విడుదలకు సిద్ధం గా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ కోసం వరుణ్ తేజ్ రాజమండ్రి కి విచ్చేశాడు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో కొంతమంది విలేఖరులు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్తలను వరుణ్ తేజ్ దృష్టికి తీసుకొచ్చాడు.
అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత మీ నాన్నగారు అనకాపల్లి నుండి పోటీ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి, మీరు ఆయన తరుపున ప్రచారం చేస్తారా అని అడగగా, దానికి వరుణ్ తేజ్ సమాధానం ఇస్తూ ‘మా ఇంట్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఒకవేళ వాళ్ళు ఆదేశిస్తే ప్రచారం చెయ్యడానికి ఎప్పటికీ నేను సిద్దమే’ అంటూ చెప్పుకొచ్చాడు.